కాశ్మీర్ గురించి తన కామెంట్స్ తో అంతర్జాతీయ ప్రముఖురాలు అయ్యింది టీఆర్ఎస్ ఎంపీ. ఇండియన్ ఎంపీ హోదాలో ఈమె కామెంట్స్ శత్రుదేశాలకు, విదేశీ మీడియాకు మంచి మేతగా మారాయి. జమ్మూ కాశ్మీర్, తెలంగాణలు భారతదేశంలోని అంతర్భాగాలు కావని ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు విదేశీ మీడియాలో కూడా ప్రముఖంగా ప్రచురితం అవుతున్నాయి. ప్రత్యేకించి కాశ్మీర్ ను తమ దేశంలో అంతర్భాగంగా కాదన్న ఎంపీగా ఆమెను విదేశీ మీడియా పతాక శీర్షికలకు ఎక్కిస్తోంది. కాశ్మీర్ పాలకుడు తన స్వతంత్ర రాజ్యాన్ని భారత యూనియన్ లో విలీనం చేశాడు. అయితే సరిహద్దులోని ఆ ప్రాంతంపై దాయాది దేశం పాకిస్తాన్ కన్నేసింది. అక్కడ హింసను సృష్టించి వేర్పాటు వాదాన్ని రగిల్చి.. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగానూ ప్రశాంతత లేకుండా చేస్తోంది. ఏదో విధంగా భారత్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. భారత్ లో అంతర్భాగం అయిన ప్రాంతం గురించి భారత పాలకులు చేసిన కొన్ని అర్థంలేని పనులు కూడా కాశ్మీర్ ను ఒక వివాదాస్పద ప్రాంతంగా మార్చాయి. ఇదీ.. ఇప్పటి వరకూ జరిగిన చరిత్ర. అయితే కల్వకుంట్ల కవిత మాత్రం ఒకే మాటతో తేల్చేసింది. కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం కాదని చెప్పింది! ఏ కాశ్మీరీ వేర్పాటు వాదో... తన పబ్బం గడుపుకోవడానికి మట్లాడినట్టుగా మాట్లాడింది కల్వకుంట్ల కవిత. ఈమె రాష్ట్ర స్థాయి అంశాల గురించి మాట్లాడి ఉంటే.. కేవలం టీఆర్ఎస్ ఎంపీ మాత్రమే అయ్యేది. అయితే అలాగాక జాతీయ స్థాయి అంశాల గురించి మాట్లాడింది. ఇప్పుడు విదేశీ పత్రికలు ఈమెను ఒక ఇండియన్ ఎంపీగా చూస్తున్నాయి. చూశారా.. ఒక ఇండియన్ ఎంపీనే కాశ్మీర్ తమది కాదు.. అని అంటోంది.. అంటూ విదేశీయులు రేపు అంతర్జాతీయ వేదికలపై వ్యాఖ్యానిస్తారు. ఏవిధంగా చూసినా ఇప్పుడు కవిత కామెంట్స్ కాశ్మీర్ విషయంలో భారత్ ను ఇబ్బంది పెట్టేవిలానే ఉన్నాయి. వేలాది మంది సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడుతున్న కాశ్మీర్ గురించి ఒక్కమాట మాట్లాడి వారందరినీ త్యాగాలకు విలువలేకుండా చేసింది కవిత. మరి ఈమెను తెలంగాణ ప్రజలు ఇంకా నెత్తిన పెట్టుకొంటారా? ఆమెతో ఏకీ భవిస్తారా?!

మరింత సమాచారం తెలుసుకోండి: