ఆంధ్రప్రదేశ్ అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మరోసారి మాటల యుద్ధానికి తెరలేచింది. జగన్ ను 420 అని టీడీపీ నేతలు విమర్శిస్తే... చంద్రబాబు 420 కంటే ఎక్కువే అని వైసీపీ నాయకులు ప్రతివిమర్శలు చేసి వారం రోజులు కూడా పూర్తి కాలేదు. ఆ మాటల వేడి చల్లారక ముందే మరోమారు ఇరు పక్షాల మధ్య తిట్ల దండకం ఊపందుకుంది. ఈసారి కూడా ఇరు పార్టీలూ పక్క పార్టీ అధినేతలనే టార్గెట్ గా విమర్శల వర్షం కురిపించుకుంటున్నాయి. ఈసారి ముందుగా జగన్ చంద్రబాబును తిడుతూ యుద్ధానికి తెరలేపితే... టీడీపీ మంత్రులు జగన్ పై ప్రతిదాడితో మరింత వేడి పెంచారు. రుణాలన్నీ మాఫీ అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు... ఇప్పుడు ప్రజలను మోసగిస్తున్నారనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయాల్సింది పోయి 12 శాతం వడ్డీ అదనంగా కట్టాల్సి వచ్చేలా కుట్రలు పన్నుతున్నారని జగన్ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇందుకు నిరసనగా చంద్రబాబును నరకాసురుడితో పోలుస్తూ... మూడు రోజుల పాటు నరకాసురవధ చేపట్టాలని ప్రతిపక్షనేత నిర్ణయించారు. చంద్రబాబు ప్రజల నెత్తిన శఠగోపం పెట్టేందుకు చూస్తున్నారని... అందుకే నిరసన కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం చేసే పనికి శ్రీకారం చుట్టామని చెప్తున్నారు వైసీపీ నేతలు. నరకాసురవధ కార్యక్రమానికి మిగిలిన ప్రతిపక్షాలూ కలిసి రావాలని ఇప్పటికే ఆహ్వానించారు కూడా. అయితే తమ అధినేతను నరకాసురుడితో పోల్చడం పట్ల టీడీపీ నేతలూ అంతే స్థాయిలో మండిపడుతున్నారు. అడ్డగోలుగా భూములను ఆక్రమించిన వైెస్ జగనే భూబకాసురుడు అని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. పిల్లచేష్టలు మానుకుని, హుందాగల ప్రతిపక్ష నేతగా ప్రవర్తించాలని సూచించారు. లేపాక్షి, వాన్ పిక్ పేరులో రైతుల లక్షల ఎకరాల భూమిని కొల్లగొట్టిన భూబకాసురుడు కాబట్టే ప్రజలు జగన్ ను తిరస్కరించారని యనమల ఆరోపించారు. ఓటమి డిప్రెషన్ నుంచి జగన్ ఇంకా బయటకు రాలేదని... లోటు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రంలో రైతు రుణమాఫీ ప్రకటించిన అధికార పక్షాన్ని అభినందించాల్సింది పోయి మతిభ్రమించి విమర్శలకు దిగుతున్నారని మరో మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ఇరు పార్టీల మధ్యా ఈ మాటల పోరు మున్ముందు ఎలాంటి పదాలను తెరమీదికి తెస్తుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: