మొదట్లో శంషాబాద్ ఎయిర్ పోర్టులో కిలో బంగారం దొరకగానే మీడియా హడావిడి చేసేది. బ్రేకింగ్ న్యూస్ మీద బ్రేకింగులు వేసేది. ఆ తర్వాత టీవీల వాళ్లకు కూడా అర్థమైపోయింది. క్రమంగా ఇదో రొటీన్ వ్యవహారం అయింది. రెండు రోజులకోసారి ఇక్కడ స్మగ్లింగ్ బంగారం దొరకడం కామన్ అయిపోయింది. దేశంలో ఇన్ని ఎయిర్ పోర్టులుంటే మరి శంషాబాద్ లోనే ఎందుకు ఎక్కువగా బంగారం పట్టుపడుతోంది.. ఇందుకు ఇంటి దొంగల సాయం ఉండటమే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. బంగారం స్మగ్లింగ్‌లో బయటపడుతోన్న ఘటనలు చూస్తుంటే ఇలా కూడా బంగారాన్ని తీసుకెళ్లొచ్చా అని ఆశ్చర్యపోక తప్పదు. బూట్లు, షూల్లోని దిగువ ప్రాంతాలు, లోదుస్తులు, బ్యాటరీలు, మొబైల్ ఛార్జర్లు శరీర అవయవాలు... చివరకు ఖర్జూరపు పళ్లలోనూ స్మగ్లింగ్ చేస్తున్నారు. ఎయిర్‌హోస్టెస్‌లు, కొందరు పోలీసులు వాటాల కక్కుర్తి కోసం స్మగ్లింగ్‌ ముఠాలతో కుమ్మక్కైనట్లుగా ఇటీవల వెలుగుచూసిన కొన్ని ఘటనల ద్వారా స్పష్టమవుతోంది. వరుస ఘటనలతో అప్రమత్తమైన కస్టమ్స్‌ అధికారులు విమానాశ్రయ సిబ్బందిపైనా నిఘా ముమ్మరం చేశారు. అంతర్జాతీయ వ్యవస్థీకృత నేర ముఠాలతో పాటు దేశీయంగా కొందరు బడా వ్యాపారులు చేసే అక్రమ రవాణాలో ఏటా కోట్ల రూపాయల విలువైన పుత్తడి మనదేశ మార్కెట్లోకి వచ్చేస్తోంది. సాధారణ ప్రయాణికులనే తమ ఏజెంట్లుగా మార్చుకొని నేరముఠాలు యథేచ్ఛగా బంగారాన్ని తెప్పించుకున్నారు. ఈ మధ్య మక్కా నుంచి జెడ్డా మీదుగా తిరిగి వస్తున్న ఐదుగురు మహిళల నుంచి ఐదున్నరకిలోల బంగారు గాజులను శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ, కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడమే ఇందుకు ఉదాహరణ. ఒక్కొక్కరికి 25 వేల రూపాయలు కమిషన్ చెల్లించి నేరముఠాలు తమ దందా కొనసాగిస్తున్నట్లుగా అధికారుల విచారణలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: