రాష్ట్రం కరవు కోరల్లో చిక్కుకోబోతోంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆశించిన స్థాయిలో వర్షాలు కురిపించకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటడమే కాకుండా, ఖరీఫ్ పంటలు వేసుకోలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. జూన్ రెండో వారంలో దేశంలో ప్రవేశించిన రుతుపవనాలు, దేశమంతా విస్తరించి చాలా రోజులైంది. ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే మన రాష్ట్రంలో మాత్రం వరుణుడు కరుణించడం లేదు. దేశంలో వర్షపాతాలను లెక్కకట్టేందుకు ఏర్పాటు చేసిన 33 డివిజన్లలో 25 డివిజన్లలో సాధారణ వర్షపాతం కన్నా 50 నుంచి 70 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్టు తెలుస్తోంది. జూలై ఆరో తేదీ నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసినా, ఎక్కడా చినుకు రాల్లేదు. ఈనెల మూడో వారంలోనైనా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెపుతున్నా అది కూడా లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు రుతుపవనాలను కాస్తంత ప్రభావితం చేస్తున్నా, అవి వర్షించడం లేదు. బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారినా, అది మన రాష్ట్రంపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఖరీఫ్ పంట సాగు కష్టమే అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న జల్లులతో పంటలకు ఉపయోగం లేదని, కుండపోత వర్షాలు ఖరీఫ్‌కు పనికొస్తాయని రైతులు చెపుతున్నారు. విశాఖ జిల్లాలో భూగర్భ జలాలు 1.5 మీటర్ల కిందకు వెళ్లినట్టు అధికారులు చెపుతున్నారు. ఆగస్ట్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెపుతున్నా, ప్రస్తుతం పరిస్థితుల్లో వాటిపై కూడా ఆశలు పెట్టుకునే పరిస్థితులు కనిపించటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: