ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త అవతారం ఎత్తనున్నారు. ప్రొఫెషనల్ బిజినెస్ మెన్ తరహాలో తన వ్యాపార పాఠాలు బోధించనున్నారు. డ్వాక్రా మహిళలు డబ్బు ఎలా సంపాధించాలో చెప్పే బాబు పాఠాలు వినాలంటే మాత్రం మరో నాలుగు నెలలు ఆగక తప్పదు. గత తొమ్మిదేళ్ల పాలనలో ఐటీ రంగాన్ని పరుగులు పెట్టించిన చంద్రబాబు... మరెన్నో అంశాల్లో అపర చాణక్యుడిగా పేరు గాంచారు. ఇప్పుడు విభజనానంతర ఏపీ పగ్గాలు అందుకుని... రాష్ట్రాన్ని మరో సింగపూర్ లా అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు. అందులో భాగంగానే మహిళలను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రణాళికలకు శ్రీకారం చుడుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా రైతు రుణాలతోపాటు డ్వాక్రా మహిళల రుణాలను సైతం చంద్రబాబు నాయుడు మాఫీ చేశారు. ప్రతి మహిళా సంఘానికి లక్ష రూపాయలు మాఫీ కానున్నాయి. అయితే ప్రభుత్వం మాఫీ చేసే ఆ లక్ష రూపాయలను తమ తమ భర్తల చేతికి ఇవ్వొద్దని ఏపీ మహిళా లోకానికి సూచించారు బాబు. తమ ప్రభుత్వం మాఫీ చేసిన లక్షను యాభై లక్షల రూపాయలుగా అభివృద్ధి చేయాలని చెప్పారు. అది ఎలా సాధ్యమవుతుందో మరో నాలుగు నెలల్లో తానే స్వయంగా చెప్తానని వివరించారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న బాబు పుట్టపర్తి సభలో ఈ ప్రకటన చేశారు. తాను మళ్లీ నాలుగు నెలల తర్వాత అనంతపురంం జిల్లాలో పర్యటిస్తానని... అప్పుడు లక్ష రూపాయలు యాభై లక్షలుగా ఎలా అవుతాయో చెప్తానని అన్నారు. గతంలో తమ పాలనలోనే డ్వాక్రా సంఘాలు ప్రారంభించామని చెప్పిన చంద్రబాబు... మహిళాభివృద్ధి కోసం మరింతగా పాటు పడతామని అన్నారు. సభలో రైతాంగానికి, విద్యార్థులు, యువతకు బాబు పలు సూచనలు చేశారు. అనంత రైతులు వేరుశనగ కాకుండా పండ్ల తోటలు వేస్తే బాగుంటుందని చెప్పారు. విద్యార్థులకు ఐపాడ్ లు, వ్యవసాయానికి రాయితీలు వంటి పలు హామీలిచ్చిన బాబు... కాంగ్రెస్, వైసీపీ నేతల పై విరుచుకుపడ్డారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో వీరప్పన్ వారసులు తయారయ్యారని ఎద్దేవా చేశారు. రైతులకు లక్షన్నర మాఫీ చేసినా చాలవంటున్న జగన్... తన అనుచరులు బినామీ పేర్లతో తీసుకున్న లక్షలాది రూపాయల రుణాలను దృష్టిలో పెట్టుకున్నారని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: