బొంగురు గొంతుతో మాట్లాడే బోళాశంకరుడు తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి. మనసులో మాట ఉన్నదున్నట్టు మాట్లాడటం ఈయనకు అలవాటు. ఇక వయసైపోయింది రాజకీయ సన్యాసం పుచ్చుకుందామనుకునే సమయానికి ఈయనకు అదృష్టం కలిసొచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేసరికి రాత మారిపోయింది. ఎమ్మెల్సీగానే ఉన్నా.. తెలంగాణ సీఎం కేసీఆర్ పిలిచి హోంమంత్రి పదవి అప్పగించాడు. వయసు మీద పడుతున్నా.. కేసీఆర్ తనపై పెట్టిన నమ్మకం నిలబెట్టుకునేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాడు. హైదరాబాద్ లోని ముషీరాబాద్ నాయని సొంత నియోజకవర్గం. అంతేకాదు హైదరాబాద్ చుట్టుపక్కల ఫ్యాక్టరీల్లోని కార్మిక సంఘాలకు ఈయన నాయకుడు. అందుకే హైదరాబాద్ పై గవర్నర్ పెత్తనమంటేనే నాయని మండిపడతాడు. తెలంగాణ ఏర్పాటైనా.. హైదరాబాద్ పై గవర్నర్ కు అధికారాలు ఇవ్వాలని ఏపీ సర్కారు కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. ఇది విభజన చట్టంలో ఉన్న విషయమే కాబట్టి కేంద్రం చొరవ తీసుకోవాలని పదే పదే పోరుతోంది. కేంద్రం కూడా అందుకు సానుకూలంగా వ్యవహరించొచ్చనే సంకేతాలు వెలువడటంతో తెలంగాణవాదులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. నాయని కూడా ఈ అంశంపై మండిపడ్డారు. శాంతిభద్రతల పేరుతో గవర్నర్ కు పెత్తనమిస్తే.. హైదరాబాద్ లో అగ్గి రాజేస్తామన్నారు. కేంద్రం కుట్రలను తెలంగాణ సమాజం తిప్పి కొట్టాలని పిలుపు ఇచ్చారు. అంతేకాదు.. ఈ అంశంపై కేంద్రం ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటే తెలంగాణలోని రాజకీయ శక్తులన్నీ ఏకం కావాలని పిలుపు ఇచ్చారు. పార్టీలు... గీర్టీలూ జాంతానై.. అంతా ఏకంగావాలె.. కేంద్రం కుట్రలు అడ్డుకోవాలె అంటూ తనదైన స్టైల్లో పిలుపు ఇచ్చాడు నాయని. ఐతే కేంద్రం తలచుకుంటే.. ఈ హెచ్చరికలు అంతగా పనిచేయవన్న సంగతి నాయనికి కూడా తెలుసు.

మరింత సమాచారం తెలుసుకోండి: