వంట మనిషి రంజాన్ ఉపవాస దీక్ష భంగపరిచారంటూ.. శివసేన ఎంపీలపై కొనసాగుతున్న విమర్శల వానపై ధీటుగా స్పందించాడు ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే. పార్లమెంటులో వివిధ పక్షాలు తమ పార్టీపై విరుచుకుపడుతున్న తరుణంలో శివసేనాని వారి సమాధానంగా ఎడిటోరియల్ రాశారు. తమ పార్టీ అధికారిక దినపత్రిక సామ్నాలో శివసేనాని స్పందించాడు. శివసేనతో పెట్టుకొనే ముందు ఎవరైనా ఆలోచించుకోవాలనే హెచ్చరికను కూడా జారీ చేశాడాయన. మీడియా ఈ వ్యవహారంలో చాలా అతి చేస్తోందని.. ఇతర రాజకీయ పక్షాలు కూడా ఓవర్ చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు. ఏమైనా అంటే.. పవిత్ర రంజాన్ మాసం అంటారని, మరి ఇదే మాసంలో ముస్లిం పెద్దలు చేస్తున్న పాపకార్యాల మాట ఏమిటని ఉద్ధవ్ ప్రశ్నించారు. వంటమనిషి ముస్లిం అనే విషయం ఎలా తెలుస్తోంది? అతడి నెత్తిన ఏమైనా ఆ విషయం రాసి ఉందా? అని ప్రశ్నించాడాయన. ఆ వంటమనిషి ముస్లిం అనే విషయం, అతడు రంజాన్ ఉపవాసంలో ఉన్న విషయం తమ పార్టీ ఎంపీలకు ఎలా తెలుస్తుందని? అతడి నెత్తిన ఆ విషయం రాసి ఉండాల్సిందని ఎద్దేవా చేశాడు. అప్ఘానిస్తాన్ లో ఒక ముస్లిం మతపెద్ద ఇదే రంజాన్ మాసంలో ఒక చిన్నారిపై అత్యాచారం చేశాడని, బెంగళూరలో ఒక ముస్లిం వ్యక్తి పదేళ్ల బాలికపై అత్యాచారం చేశాడని.. .ఇవన్నీ రంజాన్ మాసంలో జరిగిన దాష్టికాలు కావా? అని శివసేనాని ప్రశ్నించాడు. ఈ వ్యవహారాల గురించి ఎవరూ ప్రశ్నించరని.. రంజాన్ మాసంలో ఇంత దారుణాలు ఏమిటని అడగరని,.. తమ పార్టీ ఎంపీలపై మాత్రం అందరూ విరుచుకుపడుతున్నారని శివసేన అధినేత వ్యాఖ్యానించాడు. చివరగా చెబుతున్నాను... మీరు శివసేనతో గొడవపెట్టుకొంటున్నారనే విషయాన్ని గ్రహించండి అంటూ ఠాక్రే తన సంపాదకీయంలో హెచ్చరిక జారీ చేశాడు. మరి ఈ విషయంపై ఇతర పక్షాలు ఎలా స్పందిస్తాయో!

మరింత సమాచారం తెలుసుకోండి: