ఆపద వచ్చినప్పుడు ఆదుకునే వాడే అసలైన రాజకీయ నాయకుడు. ఈ విషయాన్ని టీఆర్ ఎస్ మంత్రులు మరోసారి రుజువు చేశారు. మెదక్ జిల్లా మాసాయిపేట్ దగ్గర జరిగిన ఘోర రైలు- బస్సు ప్రయాణం సందర్భంగా తెలంగాణ మంత్రులు చురుగ్గా స్పందించారు. ఘటన విషయం తెలియగానే ముందు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఘటనాస్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించారు. ఘటన తీవ్రత తెలియగానే.. సీఎం కేసీఆర్ కూడా బాగానే స్పందించారు. ఇతర కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ముందుగా కేసీఆర్ ఘటనాస్థలానికి వెళ్లాలనుకున్నా.. సహాయకార్యక్రమాలుకు ఆటంకం కలుగుతుందని భావించి విరమించుకున్నారు. మరో మంత్రి హరీశ్ రావును పంపించారు. మరో మంత్రి పద్మారావు సమయోచితంగా స్పందించారు. విషయం చూచాయగా తెలియగానే.. అంబులెన్సు సంఘ వారితో మాట్లాడి ఓ పది అంబులెన్సులను వెంటబెట్టుకుని ఘటనాస్థలానికి వెళ్లారు. అంతేకాదు.. గాయపడిన వారిని వెంటబెట్టుకుని ఆయన కూడా స్వయంగా అంబులెన్సులోనే ఆసుపత్రికి వచ్చారు. ఇక హోంమంత్రి నాయని నర్సింహారెడ్డి, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ రోజంతా యశోద ఆసుపత్రితో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. వీరిద్దరూ రాత్రి పదకొండున్నర సమయంలోనూ యశోద ఆసుపత్రిలోనే ఉన్నారు. మీడియాకు వివరాలు వెల్లడించారు. మరో మంత్రి కేటీఆర్.. ఈ విషాద ఘటన కారణంగా తన పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకున్నారు. మొన్నటి బియాస్ నది ఘటన విషయంలోనూ నాయని సహాయచర్యల్లో కీలక పాత్ర పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: