ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నది వరదనీటి గలగలల తో పరవళ్ళు తొక్కుతోంది. మరోవైపు పరివాహకంగా అంతం తమాత్రపు వర్షాలతో కష్ణానది జలాశయాలు వెలవెలబోతు న్నాయి. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు పూర్తి కావస్తు న్నా పరిస్థితి ఆశాజనకంగా లేకపోవటంతో రైతుల్లో ఆందోళన నెలకుంది. పొలాల్లో విత్తనం పడకుండానే ఖరీఫ్‌ కాలం కళ్లముందే కరిగిపోతోంది. కృష్ణా పరివాహకంగా నెలకున్న పరిస్థితులు ఇటు తెలంగాణ , అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల రైతులను నిరాశకు గురిచేస్తున్నాయి. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో దిగువన ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో గోదావరి వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. భద్రాచలం వద్ద నదినీటి మట్టం అంతకంతకీ పెరుగుతూ వస్తోంది. శుక్రవారం నదిలో 37అడుగుల మేరకు నీటిప్రవాహం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. గోదావరి నది పరివాహకప్రాంతం చివరన ధవళేశ్వరం వద్ద నదిలో పూర్తిస్థాయి నీటిమట్టం 45 అడుగులు కాగా, 44 అడుగుల ఎత్తున వరదనీరు ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద కాటన్‌ బ్యారేజ్‌ నుంచి 4.80లక్షల క్యూసెక్కుల వరదనీటిని సముద్రం లోకి విడుదల చేస్తున్నారు. గోదావరి నది పరివాహకంగా ఉన్న ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు వేగంగా పెరుగుతూ వస్తున్నాయి. శ్రీరాంసాగర్‌ జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ఇప్పటికే 1067 అడుగుల మేరకు నీటిమట్టం పెరిగింది. కడెం , లోయర్‌మానేరు, నిజాంసాగర్‌, సింగూరు తదితర జలాశయాల్లోకి కూడా ఇన్‌ఫ్లో పెరుగుతూ వస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి ఇదే రీతిలో వరదనీటి ప్రవాహాలు కొనసాగితే జలాశయాలు త్వరలోనే నిండిపోతాయని అధికారులు చెబుతున్నారు. కృష్ణానది పరివాహకంగా వర్షాభావ పరిస్థితులు ఆందోళన గొలుపుతున్నాయి. ఎగువన కర్నాటకలో కురుస్తు న్న వర్షాలు దిగువన ఉన్న తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో లేకుండా పోయాయి. కృష్ణానది పరివాహకంగా శ్రీశైలం , నాగార్జునసాగర్‌ తదితర ప్రధాన జలాశయాలు ఇంకా కనీస నీటిమట్టం స్థాయిలోనే ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు సాగునీరందించే కృష్ణానది పరివాహక జలాశయాలు నిండాలంటే సుమారు నాలుగువందల టీఎంసీల వరదనీరు రావాల్సివుందని అధికారులు చెబుతున్నారు. ఎగువన కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్టమ్మ వరదనీటి ప్రవాహంతో ఉరకలెత్తుతోంది. ఆల్మట్టి జలాశయం శరవేగంగా నిండుతూ వస్తోంది. అయినప్పటికీ ఆల్మట్టి జలాశయం నుంచి చుక్కనీటిని కూడా కిందకు వదలకుండా కర్నాటక ప్రభుత్వం బిగబట్టింది. జలాశయం పూర్తిస్ధాయిలో నిండితేగాని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోకి కృష్ణమ్మ అడుగిడే పరిస్థితి కనిపించటంలేదు. ఆల్మట్టి జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1705 అడుగులు కాగా శుక్రవారం నాటికి ఇది 1693 అడుగులకు పెరిగింది. జలాశయంలోకి 1,17,675 క్యూసెక్కుల వరదనీరు చేరుకుంటోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిలువ సామర్ద్యం 129 టీఎంసీలుకాగా, ఇప్పటికే 77టీఎంసీ నీరు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయానికి జలాశయంలో 106టీఏంసీల నీటి నిలువలు వుండేవి. దిగువన నారాయణపూర్‌ జలాశయంలో పూర్తిస్ధాయి నీటి నిలువ 37టీఎంసీలు కాగా ఇందులో 20టీఎంసీల మేరకు నీరుంది .తుంగభద్ర జలాశయంలోకి కూడా వరదనీరు భారీగానే చేరుకుంటోంది. ఎగువన కురుస్తున్న భారీవర్షాలతో తుంగభద్ర జలాశయంలోకి 67437 క్యూసెక్కుల నీరు చేరుకుంటోంది. జలాశయం పూర్తిస్ధాయి నీటి నిలువ సామర్ద్యం 100 టీఎంసీలుకాగా, ఇప్పటికే 54టీఎంసీల నీరు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయానికి తుంగభధ్ర జలాశయంలో 97టీఎంసీల నీరుండేది. రాష్ట్రంలోకి కృష్ణాజలాలు ప్రవేశించాలంటే మరో వారం పదిరోజులు ఆగాల్సిందే అని అధికారులు చెబుతున్నారు. ఇదేరీతిలో ఎగువన భారీవర్షాలు కురిస్తే ఆల్మట్టి మరో వారంలోపే నిండిపోతుందని అంచనా వేస్తున్నారు. కర్నాటక దిగువన తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టుల పరిస్థితి చూస్తే పూరి ్తనిరాశ గొలుపుతోంది. జూరాలలో పూర్తిస్ధాయి నీటి నిలువ సామర్ద్యం 11టీఎంసీలకుగాను ప్రస్తుతం 5.7టీఎంసీల నీరుంది.గత ఏడాది ఇదే సమయానికి ఇందులో 9.47టీఎంసీల నీరుండేది. శ్రీశైలంలో పూర్తిస్ధాయి నీటి నిలువ సామర్ద్యం 215టీఎంసీలుకాగా ఇందులో కనీస నీటిమట్టం స్థాయికి చేరువలో 54టీఎంసీల నీరుంది. గత ఏడాది ఇందులో ఇదే సమాయానికి 60టీఎంసీల నీరు నిలువ ఉండేది. నాగార్జునసాగర్‌ జలాశయం వెలవెల బోతోంది. 590 ఆడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి గాను ఇందులో నీటిమట్టం 511 అడుగుల స్ధాయికి పడిపోయింది. డెడ్‌స్టోరజితో కలిపి 134 టీఎంసీలుండగా, గత ఏడాది ఇదే సమయానికి ఇందులో 150 టీఎంసీల నీరుండేది. కృష్ణాడెల్టాలో కూడా 250 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. డెల్టాలో నారుమళ్లు పోసుకునేందుకు కూడా రైతులు ధైర్యం చేయలేకపోతున్నారు. ఎగువన కర్నాటకనుంచి కృష్ణమ్మ ఆల్మట్టి మీదుగా దిగువకు జాలువారితేగాని ఈ ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కృష్ణానది పరివాహక ప్రాంత రైతుల ఆశలు చిగురించేలా లేవంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: