ధనుష్.. మళ్లీ పుట్టాడు. మాసాయిపేట రైలు ప్రమాదంలో చనిపోయాడనుకున్న ధనుష్ (దర్శన్) ప్రస్తుతం యశోదా ఆస్పత్రిలో కోలుకున్నాడు. ధనుష్‌ది శుక్రవారం పుట్టిన రోజు కావడం విశేషం. తన పుట్టిన రోజు వేడుకలను ఆసుపత్రి వైద్యుల మధ్య కేక్ కట్ చేసి ఆనందంగా జరుపుకున్నాడు. అయితే, ఈ ఆనందం మరో కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ధనుష్‌ను తమ కొడుకు దత్తు (దత్తాత్రేయ)గా భావిస్తూ వచ్చిన తల్లిదండ్రులు అసలు విషయం తెలుసుకుని పుట్టెడు దుఖంలో మునిగిపోయారు. అధికారుల నుంచి సరైన సమాచారం అందకపోవడం వల్ల ఒక ఇంట ఖేదం మరో ఇంట మోదం అన్న పరిస్థితి తలెత్తింది. వివరాల్లోకి వెళ్తే.. మాసాయిపేట రైలు ప్రమాదంలో ఇస్లాంపూర్‌కు చెందిన దత్తు మృతదేహాన్ని కిష్టాపూర్‌కు చెందిన ధనుష్‌దిగా భావించి అధికారులు అతని తల్లిదండ్రులకు అప్పగించారు.  ధనుష్ కుటుంబీకులు గురువారం సాయంత్రమే మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా శుక్రవారం ఉదయం యశోదా ఆసుపత్రిలో అపస్మరక స్థితిలో ఉన్న ధనుష్ స్పృహలోకి వచ్చి తన తల్లిదండ్రుల వివరాలు చెప్పాడు. దీంతో దత్తు, ధనుష్ కుటుంబాల్లో అయోమయం తలెత్తింది. ధనుష్ తల్లిదండ్రులు స్వామిగౌడ్, పుష్పలత ఆసుపత్రికి వచ్చి కుమారుడిని గుర్తించారు. ఇలాఉండగా అంత్యక్రియలు నిర్వహించిన మృతదేహాన్ని దత్తుగా నిర్దారించారు. అప్పటి వరకూ దత్తు బతికే ఉన్నాడని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని భావిస్తూ వచ్చిన తల్లిదండ్రులు వీరబాబు, నీరజల ఆశలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి. గురువారం సంభవించిన ప్రమాదంలో వీరబాబు దంపతులు కుమార్తె భువన కూడా మృతిచెందింది. ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్న దంపతులను ఓదార్చడం ఎవరి తరంకాలేదు. ఆసుపత్రి ఆవరణలో దంపతుల ఆక్రందనలు అందర్నీ కలచివేశాయి. ఆసుపత్రికి చేరుకున్న మంత్రి హరీశ్‌రావు వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. అనంతరం దంపతులను మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కారులో స్వగ్రామం ఇస్లాంపూర్‌కు పంపించారు. మృతదేహం తారుమారైందన్న సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు ఖననం చేసిన మృతదేహాన్ని వెలికితీసి పరిశీలించారు. దత్తత్రేయదిగానే తల్లిదండ్రులు గుర్తించడంతో వారికి అప్పగించారు. అనంతరం ఆశ్రునయనాల మధ్య అక్క భువను ఖననం చేసిన సమాధి పక్కనే దత్తు మృతదేహాన్నీ ఖననం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: