సీమాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చేస్తానని టీడీపీ అధ్యక్షుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఏపీని స్వర్ణాంధ్రగా మార్చే పనిలో చంద్రబాబు బిజీగా ఉన్నారని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే ఏపీ స్వర్ణాంధ్ర సంగతేమో కానీ.. రుణాంధ్రపదేశ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆ పార్టీని పదేళ్ల తర్వాత అధికారంలోకి లాక్కొచ్చి పడేసిందని టీడీపీ వాళ్ల ఘనంగా భావిస్తున్న రుణమాఫీ హామీ ఇప్పుడు చంద్రబాబు సర్కారుకు భరించలేని గుదిబండలా తయారైంది. ఇప్పుడు అదే హామీ.. ఆంధ్రప్రదేశ్ కు అప్పుల్లో కొత్త రికార్డులు తెచ్చిపెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా తమ పార్టీ అది సాధించింది.. ఇది సాధించని చెప్పుకోవడం అలవాటు.. ఇప్పుడు టీడీపీ కూడా అదే పని చేస్తోంది. కాకపోతే.. మా చంద్రబాబు రికార్డు స్థాయిలో వేలకోట్ల రూపాయలు అప్పు తెచ్చి రికార్డు సృష్టించబోతున్నాడని చెప్పుకునే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రప్రభుత్వ అంచనాల ప్రకారమే రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలంటే.. 40వేల కోట్ల రూపాయలు కావాలి. ఏపీ ఆరంభమే లోటు బడ్జెట్ అంటే.. మొత్తం 40 వేల కోట్లు అప్పుల ద్వారానే సమకూర్చుకోవాలి. పోనీ ఎక్కడో ఓ చోట అప్పు తెచ్చుకుందామంటే.. కేంద్ర, రాష్ట్ర సంబంధాల ప్రకారం.. ఎఫ్.ఆర్.బి.ఎం చట్టం ప్రకారం.. రాష్ట్రాలకు ఎంత కావాలంటే అంత అప్పు విదేశాల నుంచి తెచ్చుకునే వీలులేదు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు చంద్రబాబు సర్కారు గట్టి కసరత్తే చేస్తోందట. ప్రభుత్వం తరపున బాండ్లు తయారు చేసి.. వాటికి ష్యూరిటీగా రాష్ట్రప్రభుత్వం ఉండి.. బ్యాంకుల వద్ద అప్పులు తేవాలని ఆలోచిస్తోంది. టీడీపీ సర్కారు ఇప్పటికే దాదాపు 30వేల కోట్ల రూపాయల అప్పులకు సంబంధించి కార్యాచరణ ఓ కొలిక్కి వచ్చిందట. ఆ నమ్మకంతోనే చంద్రబాబు రుణమాఫీని లక్షన్నర వరకూ ప్రకటించారట. మిగిలిన పదివేల కోట్ల సమీకరణ కూడా త్వరలోనే చక్కబడుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అప్పులు తీసుకురావడానికే ఇంత కష్టపడితే తీర్చడానికి చంద్రబాబు ఇంకెంత కష్టపడాలో.. అందుకే ఆ కష్టం ఒక్కరే పడకుండా.. అప్పలు తీర్చే సమయం 10 నుంచి 20 ఏళ్లకు పెంచాలని ప్లాన్ చేశారట. అంటే బాబుగారు చేసిన అప్పులు రాబోయే తరాలు కూడా తీర్చాల్సిందేనన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: