రాష్ట్రవిభజనతో రాజకీయ పరిణామాలే కాదు. ఆర్థిక పరిణామాలు కూడా చాలా మారిపోయాయి. ఏపీ జారీ చేసే ప్రభుత్వ రంగ సంస్థల బాండ్లకు డిమాండ్ తగ్గిపోయింది. అంతే కాదు.. వీటిపై అంతర్జాతీయ అగ్రశ్రేణి రేటింగ్ సేవల సంస్థ క్రిసిల్ అప్రమత్తత అవసరమనే అభిప్రాయం వెలిబుచ్చింది. ఇంతకుముందు ఏపీ ప్రభుత్వ బాండ్లకు ఇలాంటి పరిస్థితి పెద్దగా ఎదురుకాలేదు. అంటే విభజనతో ఏపీ ఆర్థిక పరిస్థితుల తలరాత కూడా మారిపోయిందన్నమాట. తాజా విభజన, రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ అభిప్రాయం వెలిబుచ్చామని క్రిసిల్ సంస్థ ప్రకటించింది. నిధుల సమీకరణ కోసం ప్రభుత్వ రంగ సంస్థలు బాండ్లు జారీ చేస్తుంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్ కో వంటి అనేక సంస్థలు ఇలా బాండ్లు జారీ చేసి.. నిధులు సమీకరించాయి. వీటికి క్రిసిల్ ఇచ్చిన తాజా రేటింగ్ వర్తిస్తుందన్నమాట. కేవలం రేటింగ్ తగ్గించి జాగ్రత్త అంటూ హెచ్చరించిన క్రిసిల్ అందుకు కారణాలేంటో కూడా తన నివేదికలో వివరించింది. క్రిసిల్ ప్రస్తావించిన విషయాలేంటో తెలుసా.. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాలు ఇంకా పూర్తి కాలేదు. ఇవి ఏ రాష్ట్రానికి ఎలా పంచుతారన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. గతంలో ఏపీ సంస్థలు జారీ చేసిన బాండ్లు తిరిగి చెల్లించే బాధ్యత రెండు రాష్ట్రాల మధ్య సరిగ్గా పంపిణీ కావాలి. రాజకీయ వివాదాల నేపథ్యంలో ఇది సక్రమంగా అవుతుందన్న నమ్మకం కలగడం లేదు. వీటికి తోడు ఏపీ ప్రకటించిన రుణమాఫీ ప్రభావం కూడా ఈ రేటింగ్ పై ఉంది. ఇవన్నీ తేలాకే మరోసారి రేటింగ్ ను సమీక్షిస్తామని క్రిసిల్ తేల్చి చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: