రాజధానిని నిర్మించే విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ‘సలహా సంప్రదింపుల సంఘాన్ని నియమించింది! ఈ నియామకాన్ని వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వపు ఉత్తర్వు - జిఓ- వెలువడడంతో ఒక అధికారిక లాంఛనం పూర్తయినట్టయింది! కేంద్ర ప్రభుత్వం నియమించిన అభ్యుదయ బృందం వారు తమ పనిని ఓవైపు పూర్తిచేస్తున్న సమయంలోనే అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇలా ఓ సంఘాన్ని నియమించడంపట్ల రాజధాని నిర్మాణ కార్యక్రమం వేగవంతం అవుతుందా? లేక మరింత గందరగోళం నెలకొంటుందా? అన్నది వేచిచూడదగిన వ్యవహారం! తుది నిర్ణయం ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకుంటారు? అనే ప్రశ్నలు కూడా కొనసాగుతున్నాయి! ఇన్ని రోజులుగా అనధికార ఊహగానాలు ఉర్రూతలూగించాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సైతం రాష్ట్ర రాజధానికి ‘సింగపూర్’ స్థాయిలో నిర్మిస్తామని చెప్పుకొచ్చారు కానీ ఎక్కడ నిర్మిస్తారో చెప్పడానికి సాహసించలేదు! అందువల్ల నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నగరం వాణిజ్య ఊహాగాన - స్పెక్యులేషన్ - ‘డోలిక’ కావడం విచిత్రమైన పరిణామం! ఆధికారికంగా ఎలాంటి నిర్ణయం వెలువడకపోయినప్పటికీ, రాజధాని ఫలానాచోట’ నిర్మాణమైపోతున్నట్టు నిర్దిష్టమైన సమాచారాన్ని ఊహాగానకళ నిపుణులు ఆవిష్కరించేశారు! ‘‘చేనులో పత్తి చేనులో ఉండగానే నీకు మూరెడు, నాకు బారడు...’’ అని అన్నట్టుగా రాష్ట్ర రాజధాని నిర్మాణం కానున్న ఆ ఫలానా చోట పారిశ్రామిక వేత్తలు, గృహనిర్మాతలు, గిడ్డంగుల కామందులు, గూడుపుఠాణి కర్తలు ఇంకా ఇంకా ఎందరెందరో భూములను కొనేశారట! లక్షల రూపాయల విలువైన భూములను కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన తరువాత పెట్టుబడిదారుల వ్యూహం బెడిసికొడుతోంది! ‘‘రాజధాని ఇక్కడ కాదట, అదిగో అక్కడ...’’ అని స్థలాన్ని కచ్చితంగా వేలుపెట్టి చూపిస్తున్న ఊహాగాన కోవిదుల మాటలు భూమిని కొన్నవారి నెత్తిన పిడుగులు...’’ కొత్త రాజధాని చోటికి ఈ భూమిని మోసుకొని పోలేరు కదా! అందువల్ల కొన్న కామందులు కూలబడిపోతున్నారు!! ఇలా కలల మేడలు కూలిపోవడాలు, కొత్తకొత్తవారు కొత్త ‘స్థలం’లో మళ్లీ కొత్త ‘స్వప్నాల’ను నిర్మించడాలు... ఇదే గత కొన్ని నెలలుగా నడుస్తున్న చరిత్ర! నూతన రాజధాని నిర్మాణ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన భూమి సేకరణ చట్టం వల్ల అవరోధాలు ఏర్పడనున్నట్టు జరుగుతున్న ప్రచారం ఊహాగాన వైచిత్రికి పరాకాష్ఠ. 1895 నాటి కాలదోషం పట్టిన భూమి సేకరణ చట్టాన్ని రద్దు చేయాలని కొత్త చట్టాన్ని రూపొందించాలని అనేకసార్లు సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించిన తర్వాతనే గత ఏడాది కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం వ్యవసాయదారులనుండి సేకరించే భూమికి పరిహారం గతంలో కంటె బాగా ఎక్కువ చెల్లించాలి. అందువల్ల తక్కువ పరిహారంతో రైతుల భూములను సేకరించడానికి వీలు లేకపోవడం వల్ల రాజధాని నిర్మాణం ఆలస్యమవుతుందట. అంటే చట్టం ప్రకారం న్యాయమైన పరిహారం చెల్లించనక్కరలేకుండానే రైతులు భూములను లాక్కొని రాజధానిని నిర్మించాలన్నది ఊహాగానవేత్తల ఆకాంక్ష. ఒకవైపున లక్షల ఖరీదు చేసే ఎకరా పొలాన్ని కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వేతర సంస్థల వారు కొనుగోలు చేశారని, చేస్తున్నారని ప్రచారం...మారోవైపున చట్ట ప్రకారం చెల్లించవలసిన ధరలను రైతులకు ప్రభుత్వం ఇవ్వజాలదని ఊహాగానం. రాజధానిని తమ జిల్లాలలోనే ఏర్పాటు చేయాలని ప్రతి జిల్లానుండి ముఖ్యమంత్రికి విజ్ఞప్తులు అందుతున్నాయట. ఒత్తడి పెరుగుతోందట. సమాంతరంగా తమ సమీప స్థలంలో రాజధానిని ఏర్పాటు చేయరాదని వ్యవసాయదారులు భావిస్తున్నట్టు కూడ వదంతులు. రాజధాని నగర నిర్మాణం కోసం ప్రభుత్వం తమ జీవనాధార వ్యవసాయ క్షేత్రాలను స్వాధీనం చేసుకుంటుందని రైతులు భయాందోళనలకు గురి అవుతున్నారట. రాజధానిలో పాలనా వ్యవస్థలను మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నట్టయితే ఊహాగానాలు సాగుతున్నట్టుగా వేలాది ఎకరాల భూమిని సేకరించవలసిన అవసరం ఏమిటి? రాజధాని నగరం మరో హైదరాబాద్ మహానగరం వలె మైళ్లకొలదీ విస్తరించి, కోటి జనాభాతో అలరారుతుందన్న కల్పన సామాన్యుల మనస్సులలో ఏర్పడి పోవడం వల్ల ఇదంతా జరిగిపోతోంది. ‘వికేంద్రీకృత ప్రగతి, వికేంద్రీకృత వ్యవస్థ’’ అన్న ప్రచారంలో చిత్తశుద్ధి ఉన్నట్టయితే ప్రభుత్వం రాజధానిని చిన్న పట్టణంగా అందంగా శుభ్రంగా దిద్దవచ్చు. సింగపూర్ తరహా రాజధాని అనగానే లక్షల జనసమ్మర్ధం, కాలుష్య పారిశ్రామిక వాటికలు, అన్ని రంగాలు ఒకే చోట కేంద్రీకృతమైన బృహత్ నగర ప్రాంగణం స్ఫురిస్తుంది. కేవలం ఆరువందల చదరపు కిలోమీటర్ల భూమిపై ఆరవైలక్షల మంది ప్రజలు ఉన్న ‘సంత’ సింగపూర్. ఈ ఊహ కారణంగా కొత్త రాజధాని నగరంలో ఏర్పడబోయే నీటి కటకట గురించి కూడ కథనాలు వెలిశాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని కేవలం పరిపాలన కేంద్రంగా నిర్మించాలన్న నిర్ధారణకు రాష్ట్ర ప్రభుత్వం రావడానికి ఎంత సమయం పడుతుందో మరి. పరిశుభ్ర నగరం, హరిత నగరం, సుందర నగరంగా రాజధాని రూపొందాలంటే ప్రస్తుతం ఉన్న కిటకిటలాడే జాతీయ రహదారులకు, ప్రధాన రైలు మార్గాలకు దూరంగా నిర్మించడం మేలు. రాజధానికి వెళ్ళవలసిన వారు మినహా జాతీయ పథగాములెవ్వరూ రాజధాని గుండా ప్రయాణించ వలసిన అవసరం లేదు. అలాగని ఉత్తరం కొసలోనో దక్షిణాగ్రంలోనో రాజధానిని నిర్మించాలని కూడ ఎవ్వరూ కోరుకోవడం లేదు. అన్ని జిల్లాలకు అందుబాటులో ఉండే విధంగాను కేవలం పరిపాలన కేంద్రంగా మాత్రమే రాజధాని రూపొందాలి. చండీగఢ్ ఈ ఆదర్శానికి కొంత దగ్గరిగా ఉంది. 115 చదరపు కిలోమీటర్ల పరిధిలోని నగరం జనాభా పదిలక్షల లోపే. రాజధాని పరిధిలో పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేయడానికి వీలు కల్పించరాదు. అవన్నీ వేరే నగరాలలో పెట్టుకోవచ్చు. అలాగే విద్యా కేంద్రాలను సైతం రాజధానికి దూరంగా ఉంచాలి. రాజకీయ కాలుష్యం అంటని చోట గురుకులాలు, మహా విద్యాలయాలు విలసిల్లడం అనాదిగా భారతీయ సంప్రదాయం. కేంద్ర ప్రభుత్వపు ప్రాంతీయ కార్యాలయాలు, రిజర్వ్ బ్యాంక్ శాఖలు, వాణిజ్య బ్యాంకుల ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలు కూడ రాష్ట్ర రాజధానిలో కాక ఇతర పట్టణాలలో, నగరాలలో ఏర్పాటు చేసినట్టయితే రాజధానిలో అంతస్థుల భవనాలను నిర్మించి కాలుష్యం పెంచే ప్రమాదం తప్పిపోతుంది. ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందా? అన్నది వేచి చూడదగిన అంశం. ఇప్పుడు ప్రభుత్వం నియమించిన సలహా సంప్రదింపుల సంఘంలో పారిశ్రామికవేత్తలు, పెద్దపెద్ద పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు ఎక్కువ మంది చేరిపోయారు. పరిపాలన కేంద్రమైన రాజధాని నగర నిర్మాణం కోసం ఏర్పడిన సంఘంలో ఇంతమంది పారిశ్రామిక మేధావుల అవసరం ఏమిటి? నిర్మించనున్నది రాజధానిలోని పారిశ్రామిక వాటిక కాదు. ప్రత్యేక ఆర్థిక మండలమూ కాదు. పట్టణ నిర్మాణ సాంకేతిక నిపుణుల సహకారంతో నిర్ణయించవలసింది రాజకీయ నాయకత్వం మాత్రమే. రాజధానిలో బృహత్ పారిశ్రామిక వాణిజ్య వాటికలను నిర్మించకండి. ముఖ్యమంత్రి పదమూడు వారాల పాటు పదమూడు జిల్లాలనూ సందర్శిస్తారట. ఈ సందర్శన పూర్తయ్యేసరికి రాజధాని నమూనా రూపొందుతుందేమో?!

మరింత సమాచారం తెలుసుకోండి: