గత సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి సోషల్‌ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేసి ప్రజాదరణ పొందిన విధంగానే ప్రభుత్వ పథకాలు, ఇతర కార్యక్రమాలను సోషల్‌ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి మరింతగా ప్రజాదరణ పొందాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచి స్తోంది. ఈ మేరకు 'తెలంగాణ సిఎంఓ' పేరుతో ఫేస్‌బుక్‌లో ఖాతా తెరవాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రికి సంబంధించిన కార్యకలాపాలు, ప్రభుత్వ పథకాలు, వివిధ శాఖల్లో చేపడుతున్న కార్యక్రమాల గురించి ఈ ఖాతాలో పొందుపర్చడం ద్వారా వాటిని విస్త్రతంగా ప్రచారం చేయడమే కాకుండా వాటిపై ప్రజల అభిప్రా యం కూడా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో జాతీయస్థాయిలో సోషల్‌ మీడియా కారణంగానే బిజెపికి, ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన నరేంద్రమోడీకి విస్తృత ప్రచారం లభించడం, తద్వారా బిజెపికి మధ్యతరగతి ప్రజల ఆదరణ లభించడంతో అధికారం చేపట్టింది. అభివృద్ధి చెందిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ తదితర సోషల్‌ మీడియాలో ప్రజలు ఎక్కువ కాలం గడుపుతున్న విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు పథకాల గురించి తెలియజేసేందుకు ఒకవైపు ఎప్పటి మాదిరిగా సభలు, సమావేశాల ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు సోషల్‌ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు సిఎంఓ కార్యాలయం కూడా అందుకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించడం, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవడంలో నిమగమైనట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: