మనకు మంచి రోజులు వచ్చాయో లేదో గానీ నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అంబానీ, ఆదానీల కంపెనీలకు మంచి రోజులు బాగానే వచ్చాయట. ఇది ప్రతిపక్షం చేసిన విమర్శ కాదు. స్వయంగా కాగ్ వెల్లడించిన వాస్తవం. రాష్ట్ర ఆర్థిక వనరుల పట్ల గుజరాత్ ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవహరించలేదని, దాని విలువ దాదాపు 25 వేల కోట్ల రూపాయలని కాగ్ తెలిపింది. అంబానీలకు చెందిన రిలయన్స్ పెట్రోలియం, ఆదానీకి చెందిన ఎస్సార్ పవర్ కంపెనీలకు 1500 కోట్ల రూపాయల అయాచిత లబ్ధి ఎచేకూరినట్టు కాగ్ వెల్లడించింది. రిలయన్స్, ఎస్సార్ కంపెనీలతో గుజరాత్ ప్రభుత్వం కుదుర్చుకున్న వివిధ ఒప్పందాల సందర్భంగా ప్రజల ప్రయోజనాలకు బదులు ఆ కంపెనీల ప్రయోజనమే ప్రధానమైనట్టు స్పష్టమవుతోందని కాగ్ తెలిపింది. గుజరాత్ ప్రభుత్వ వైఖరి వల్ల ప్రజా ధనం ప్రయివేటు కంపెనీల పరమైందని పేర్కొంది.  ఈ రెండు కంపెనీలతో వివిధ సందర్భాల్లో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు, వాటిలో ఆ కంపెనీలకు అయాచితంగా లబ్ధి కలిగిన వివరాలను కాగ్ తెలిపింది. అంశాల వారీగా, ఒప్పందాల వారీగా కాగ్ ఈ అంశాలు వెల్లడించింది. కాగ్ నివేదిక వివరాలను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఈ కంపెనీలకు లబ్ధి చేకూర్చడంతో పాటు వివిధ పథకాల్లో లోటుపాట్లు, లోపాల కారణంగా వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని తెలిపింది. మొత్తం మీద గుజరాత్ ప్రభుత్వ వైఖరి వల్ల ఖజానాకు వాటిల్లిన నష్టం మొత్తం విలువ 25 వేల కోట్లని కాగ్ లెక్క గట్టడం విశేషం. మే నెలలో మోడీ ప్రధాని అయ్యారు. అంతకుముందు ఆయనే ముఖ్యమంత్రి కాబట్టి ఈ వైఫల్యాలకు ఆయనే బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: