చంద్రబాబు గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. డ్వాక్రామహిళా సంఘాలను చైతన్య పరిచి వారిలో కొత్త ఊపు తెచ్చారు. మహిళాశక్తిని వెలికితీశారు. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ ఫీల్డ్ పై దృష్టి పెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఈసారి యువతను టార్గెట్ చేయదలిచారు. వారిని అభివృద్ధిలో భాగస్వాముల్ని చేసే దిశగా ప్లాన్ చేస్తున్నారట. ఎన్నికల హామీలో ప్రకటించిన విధంగా ఉద్యోగాలు లేని వారికి నిరుద్యోగ భృతి కల్పించటంతో పాటు వృత్తి నైపుణ్యం శిక్షణ ఇప్పించి.. తప్పని సరి ఉపాధి లభించేలా యాక్షన్ తీసుకుంటారట. కొత్త ఉద్యోగాల కల్పన ద్వారా నిరుద్యోగ యువతకు చేయూత నిచ్చేందుకు బాబు సన్నాహాలు చేపట్టారు. ఎన్నికల హామీలో ప్రకటించిన విధంగా ఇంటికో ఉద్యోగం కల్పించేందుకు యువతకు శిక్షణ అవసరమని భావిస్తున్న బాబు అందుకు తగ్గట్లుగా ప్రతి మండలంలోను శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వారికి స్థానికంగానే ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటారట. ఇందుకు యువజన సర్వీసుల కోసం కేంద్రం కేటాయించే నిధుల్ని సద్వినియోగం చేసుకుంటారట. ఉత్సవ విగ్రహాల్లా మారిన జిల్లా ఉపాధి కల్పనా కేంద్రాలను ప్రక్షాళన చేసి వాటికి పూర్వవైభవం తీసుకురావాలని ఆలోచిస్తున్నారట. కిరణ్ సర్కారు రాజీవ్ యువకిరణాలు పేరుతో యూత్ ను ఆకట్టుకోవాలని ట్రై చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందే రాజీవ్ ఉద్యోగశ్రీ అంటూ కాంగ్రెస్ సర్కారు హడావిడి చేసింది. ఇప్పుడు బాబు తీసుకునే చర్యలు వీటికి భిన్నంగా ఉంటాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులకు డబ్బులు దోచిపెట్టే విధంగా తయారైన శిక్షణ కేంద్రాల రూపురేఖలు మారుస్తామంటున్నారు. వీటిని యువతకు లబ్ధి చేకూర్చేలా మారుస్తామని చెబుతున్నారు. రాజీవ్ యువకిరణాలు, రాజీవ్ ఉద్యోగశ్రీ పేర్లను మార్చి ఉపాధి కల్పనను ఒకే గూటికిందకు తెచ్చెలా... కొత్త పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టాలని ఏపీ సర్కారు ప్లాన్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: