పుత్రజయ.. ఎక్కడో మలేసియాలోని ఈ నగరం హఠాత్తుగా ఏపీ జనానికి ఇంట్రస్టింగ్ టాపిక్ అయిపోయింది. పుత్రజయ నగరం తరహాలో ఏపీ రాజధాని కట్టాలని బాబు సర్కారు ఆలోచిస్తుండటమే దీనికి కారణం.. ప్రపంచంలో ఇన్ని నగరాలు ఉండగా... చంద్రబాబు కన్ను ఈ పుత్రజయ మీదే ఎందుకు పడింది. ఇంతకూ ఈ పుత్రజయ ప్రత్యేకతలేంటి.. ఈ నగరంలో చంద్రబాబును అంతగా ఆకట్టుకున్నదేంటి.. ఓసారి చూద్దాం.. ప్రకృతి రమణీయత, మచ్చుకైనా కనిపించని కాలుష్యం, రణగొణ ధ్వనులేవీ వినిపించని ప్రశాంత వాతావరణం ఈ పుత్రజయ సొంతం. కనుచూపు మేర పరుచుకున్న పచ్చని అందాలు, క్రమ పద్ధతిలో పెంచిన ఎత్తైన చెట్లు.. వాటిని తలదన్నే రీతిలో నిర్మించిన ఆకాశహర్మ్యాలు.. వీటికి తోడు సెలయేటి గలగలలు. ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రణాళికబద్ధ ఉద్యాననగరంగా పేరొందింది పుత్రజయ. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో దాదాపు 12 వేల ఎకరాల్లో ఈ పుత్రజయను నిర్మించారు. పరిపాలన సౌలభ్యం కోసం నిర్మించిన హరితవన నగరమిది. ఇందులో 40 శాతం ప్రాంతాన్ని ఉద్యానవనాలు, భారీ మంచి నీటి జలాశయాలతో తీర్చిదిద్దారు. సహజ ప్రకృతి సౌందర్యం ఏమాత్రం దెబ్బతినకుండా నిర్మాణాలు చేపట్టారు. ఆసియాలోనే అతి పెద్ద నిర్మాణంగా పేరుగాంచిన ఈ మహా నగరం నిర్మాణానికి 48 వేల కోట్లరూపాయలకుపైగా ఖర్చయింది. 1995లో నగర నిర్మాణం ప్రారంభించారు. ఆరేళ్లలో పూర్తిస్థాయిలోకి అందుబాటులోకి వచ్చింది. మలేషియాలోనే అతిపెద్ద బొటానికల్ గార్డెన్‌, పెద్ద పెద్ద మంచినీటి కొలనుల ఉన్న పుత్రజయ 50 చదరపు కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు అత్యున్నత రవాణా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 60 వేల మందికి పైగా జనాభా ఉండే ఈ మహానగరంలో ఎక్కువ శాతం ప్రభుత్వ ఉద్యోగులే. ఈ పచ్చని నగరం మలేసియా మాజీ ప్రధాని మహతీర్ మహ్మద్ మానసపుత్రిక. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం అంతర్జాతీయస్థాయి నగరాలను పరిశీలిస్తున్న ప్రభుత్వ ప్రతినిధులు... పుత్రజయను సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హరితవన నగరాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచనలో ఉండటంతో .. ప్రపంచంలోనే అత్యున్నత హరితవననగరంగా పేరుగాంచిన పుత్రజయను నమూనాగా తీసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: