"నా తెలంగాణ కోటిరతనాల వీణ" అన్నారు మహాకవి దాశరథి క్రిష్ణమాచార్యులు. తెలంగాణ సీఎంగా పాలనా పగ్గాలు అందుకున్న కేసీఆర్... దాశరథి మాటలు నిజం చేయడానికి శ్రమిస్తున్నారు. అందులో భాగంగానే దాశరథి మాటను పోలిన కొత్త పల్లవి అందుకుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో పూలసాగుకు పెద్ద పీట వేయాలని ఆలోచిస్తూ "నా తెలంగాణ అడుగడుగునా పూలవాన" అనే కొత్త రాగం పాడుతున్నారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి మంచి భవిష్యత్తు ఉందని ప్రమాణ స్వీకార ప్రసంగంలోనే తెలిపిన సీఎం... ఇప్పుడు ఆ దిశగా అడుగుల వేగం పెంచారు. విత్తనాభివృద్ధి కేంద్రంగా మంచి మనరులు తెలంగాణ భూముల్లో ఉన్నాయన్న కేసీఆర్... పూల సాగుతోనూ కాసుల వర్షం కురిపించేందుకు ప్రణాళికలు రచించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పూలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అంతటా పూల సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ పద్దతిలో పూలను పెంచితే లాభాలు అంతంత మాత్రమే అని గ్రహించింది తెలంగాణ ఉద్యానశాఖ. అందుకే ఇజ్రాయిల్ తరహాలో గ్రీన్ హౌజ్ లేదా పాలీ హౌజ్ లలో సాగును ప్రోత్సహించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. తొలిదశలోనే సుమారు 300 కోట్ల రూపాయల రాయితీ ఇవ్వడానికి నిర్ణయించారు. విస్తారంగా పూలసాగును ప్రోత్సహించడంతోపాటు హైదరాబాద్ లో పూలకేంద్రం నిర్మించాలని తీర్మానించారు. గుడి మల్కాపూర్ మార్కెట్లో అధునాతన సౌకర్యాలతో పూల వేలం కేంద్రం, రైతుల శిక్షణకు ప్రత్యేక హాలు, పూలను భద్రపర్చడానికి శీతల గిడ్డంగులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనా ఉంది. తొలి దశలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వెయ్యి ఎకరాల్లో పూలసాగుకు రాయితీని అందించనున్నారు. లబ్ది పొందిన రైతుల సాయంతో ఈ పద్దతిని వ్యాప్తి చేయాలని ఆలోచిస్తున్నారు. అయితే ఈ రకమైన గ్రీన్ హౌజ్ పూలసాగుకు సంబంధించి ఇప్పటికే ఉద్యానశాఖకు ధరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. వీరందరికీ రాయితీలు ఇవ్వడంతోపాటు పూలసాగును కూడా వ్యవసాయంలో భాగంగా గుర్తించి రుణాలు అందించాలనే డిమాండ్ కూడా ఉంది. మరి వీటన్నిటినీ అధిగమించి "నా తెలంగాణ అడుగడుగునా పూల వాన" అంటున్న కేసీఆర్ ఆలోచనలు ఎంతవరకు ఫలిస్తాయో... "నా తెలంగాణ కోటి రతనాల వీణ" అన్న దాశరథి ఆశయ సాధనకు ఏ మేరకు ఉపకరిస్తాయో...

మరింత సమాచారం తెలుసుకోండి: