సీమాంధ్ర సహిత ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమకు మరోసారి దారుణమైన మోసం జరగబోతోందని అంటున్నారు ఆ ప్రాంత వాసులు, ఆ ప్రాంత మేధావులు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త రాజధాని నిర్మాణం విషయంలో రాయలసీమను మోసం చేసే పని జరుగుతోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు నిధుల విషయంలో రాయలసీమపై ఆధారపడుతున్న ప్రభుత్వం కేటాయింపుల విషయంలో మాత్రం ఆంధ్రకు పెద్ద పీట వేస్తోందని వారు అంటున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. రాష్ట్ర ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో పెద్దలుగాచెలామణి అవుతున్న అనేక మంది ఏమైనా అంటే.. రాజధాని అనే విషయం గుర్తుకు రాగానే... గుంటూరు, విజయవాడ అని అంటున్నారు. రాజధాని అక్కడ అయితే బావుటుందని అంటున్నారు. ఖాళీ కేన్వాస్ మీద ఆర్ట్ లాగా చెక్కాల్సిన రాజధాని నగరాన్ని వారు గజిబిజిగా ఇరుకుగా ఉన్న గుంటూరు, విజయవాడల మధ్య పెడతామని అంటున్నారు. ఇదే చాలామందికి కోపాన్ని తెప్పిస్తోంది. నీళ్ల సాకు చెప్పి.. రాయలసీమను రాజధానికి అనర్హురాలిగా చేస్తున్నారని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. మరి సీమ లో వనరులు లేవన్నట్టుగా, నీళ్లు లేవంటూ... రాజధాని నగర నిర్మాణానికి ప్రాధాన్యతను ఇవ్వని ప్రభుత్వం.. అదే నిధుల విషయంలో మాత్రం రాయలసీమ పై ఆధారపడుతోంది. రుణమాఫీ కోసం అయినా... రాజధాని నిర్మాణం కోసం అయినా... నిధులు ఎక్కడా? అంటే ఎర్రచందనం అని అంటున్నారు ప్రభుత్వంలోని పెద్దలు! మరి ఆ ఎర్రచందనం నిల్వలు అన్నీ సీమలోనే ఉన్నాయి. వాటిని కొల్లగొట్టి ప్రభుత్వం రాజధానిని నిర్మిస్తుండట! మరి ఇదెంత అన్యాయమో వేరే చెప్పనక్కర్లేదు. ఇలాంటి పరిణామాలు చాలా త్వరగా ప్రత్యేక రాయలసీమరాష్ట్రాన్ని డిమాండ్ చేసేందుకు కారణం అవుతాయని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: