బంగాళా ఖాతంలో ఆదివారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఉత్తర పడమటి దిశగా వాయువ్యంగా అల్పపీడనం ఏర్పడింది. దీంతోపాటు ఒడిశా నుండి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర నీటి మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కూడా కొనసాగుతోంది. అల్పపీడన ద్రోణి దక్షిణ పడమటి దిశగా పయనిస్తోంది.రానున్న 48 గంటల్లో పశ్చిమ ఉత్తర దిశగా పయనించి మరింత బలపడే అవకాశం ఉంది. అల్పపీడనం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఒడిశా, తెలంగాణ, కోస్త్రాంధ్రాల్లో అనేక ప్రాంతాల్లో రానున్న 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపినట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు సైతం తెలంగాణ, ఒడిశాల్లో బలంగా విస్తరించి ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలో అనేక ప్రాంతాల్లో అక్కడక్కడ జల్లులతో కూడిన వర్షాలుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. అల్పపీడనం, అల్పపీడన ద్రోణి ఈ రెండింటి ప్రభావంతో కోస్తాంధ్రాలో తీరం వెంబడి ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. జూన్‌ 1 నుండి జులై 27 వరకు వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి: దేశవ్యాప్తంగా 415 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతానికి గాను 25 శాతం కొరతతో కేవలం 309.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దక్షిణాది రాష్ట్రాల్లో సైతం సాధారణ వర్షపాతం 350. 5 మిల్లీ మీటర్లకుగాను 24 శాతం కొరతతో 267.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రాలోని 9 జిల్లాల్లో సాధారణ వర్షపాతం 242.7 మిల్లీ మీటర్లకు గాను 134 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదై 45 శాతం వర్షం కొరత నమోదైంది. తెలంగాణలోని పది జిలాల్లో సాధారణ వర్షపాతం 338.6 మిల్లీ మీటర్లకు గాను 162.1 మిల్లీ మీటరు వర్షపాతం నమోదై 52 శాతం కొరత ఏర్పడింది. రాయలసీమ 4 జిల్లాల్లో 148.7 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతానికి గాను 17 శాతం కొరతతో 124.1 మిల్లీ మీటరు నమోదైంది. దేశ వ్యాప్తంగా భారత వాతావరణ శాఖ 36 సబ్‌ డివిజన్లలో 14 డివిజన్లలో సాధారణ వర్షపాతం కాగా 21 సబ్‌ డివిజన్లలో కొరత నమోదు కాగా, 1 సబ్‌ డివిజన్లో తీవ్ర కొరత కొనసాగుతోంది.  కాగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు సాధారణం కన్నా 52 శాతం తక్కువ వర్షపాతం నమోదుకాగా, గడిచిన 24 గంటల్లో 8సెంటిమీటర్లు, నర్మెట్టలో 7, ఇబ్రహీంపట్నం, నిర్మల్‌, గోవిందరావుపేట, జూలపల్లిలో 6, మద్దూరు, ఘన్‌పూర్‌, పరకాల, హుజురాబాద్‌లో 5, తిమ్మాపూర్‌, ఏకులపల్లి కమ్మర్‌పల్లి, గుండాలలో 4 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదిలా వుండగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు సాధారణం కన్నా 45శాతం తక్కువ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. గడిచిన 24గంటల్లో తిరువూరు, నరసాపురంలో 5సెం.మీ.లు, నూజివీడు, కైకలూరుల్లో 4, ఎలమంచిలి, భీమడోలు, భీమవరం, మచిలీపట్నంలలో 3, వెలుగోడు, మిడుతూరుల్లో 3, పిడుగురాళ్ల, చింతలపూడి, విజయవాడ, తణుకులో 2సెం.మీ. వర్షపాతం నమోదైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: