బగ్గింగ్‌ వ్యవహారం సోమవారం పార్లమెంట్‌ను కుదిపివేసింది. బిజెపి సీనియర్‌ నాయకుడు, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ నివాసంలో, అందులోనూ బెడ్‌రూంలో నిఘా పరికరాలు దొరకడం, బగ్గింగ్‌ జరుగు తున్నట్లు వార్తలు వెలువడటంపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. దీనిపై వెంటనే సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. అయితే నితిన్‌ గడ్కరీ తన నివాసంలో బగ్గింగ్‌ పరికరాల ఏవీ దొరకలేదని, వార్తలన్నీ నిరాధారమని ప్రకటించారని, ఇక దర్యాప్తు అవసరం లేదని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, సహాయ మంత్రి కిరెన్‌ రిజిజూప్రతిపక్షాల వాదనను తోసిపుచ్చారు. సోమవారం పార్లమెంట్‌ ప్రారంభం కాగానే, ఇదే అంశంపై ప్రతిపక్షాలు ప్రభుత్వ ప్రకటనకు డిమాండ్‌ చేశాయి. అధికార పక్షం నేత, అందులోనూ కేంద్ర హైవేలు, రవాణా మంత్రి నివాసంలో గూఢచార్యం ఆనవాళ్లు దొరకడం చిన్న విషయమేమీ కాదని, కేవలం మంత్రి వివరణలతో సరిపోదని, దీనిపై ప్రభుత్వం నుంచి సమగ్ర ప్రకటన కోరుతున్నామని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. బగ్గింగ్‌ వ్యవహా రంలో నిజం లేదని స్వయంగా సంబంధిత మంత్రి గడ్కరీ చెప్పిన మీద, వచ్చిన వార్తలు అసంబద్ధంగా ఉన్నాయని చెపుతున్న దశలో ఇక దీనిపై ప్రతిపక్షాలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయో తెలియడం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెన్‌ రిజిజూ విమర్శించారు. తప్పుడు వార్తలపై వ్యాఖ్యానం పరమ తప్పు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్‌ నేత మనీష్‌ తివారీ ఆయనకు జవాబు ఇస్తూ, బగ్గింగ్‌ ఉదంతాన్ని చిన్నగా చూడటానికి వీల్లేదని, ప్రభుత్వం సముచిత రీతిలో స్పందించాల్సి ఉందని తెలిపారు. పౌరులకు ఇలాంటి అనుభవాల నుంచి ఏ రకమైన రక్షణ, భద్రత ఉందనేది అంతా తెలుసుకోగోరుతున్నారని, పార్లమెంట్‌ వేదికగా ప్రభుత్వం తన వివరణ ఇచ్చుకోవల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆదివారం చేసిన వ్యాఖ్యలను ఎన్‌సిపి నేత తారీఖు అన్వర్‌ ప్రస్తావించారు. ప్రభుత్వం నుంచి ప్రకటన రావల్సిందేనని, బగ్గింగ్‌ జరిగిందా? లేదా? అనేది తేలాల్సి ఉందని, జరిగితే ఎవరు బాధ్యులు? పిఎంఓ నుంచి ప్రమేయం ఉందా? లేక విదేశీ శక్తులకు దీనితో సంబంధం ఉందా? అనేది స్పష్టం కావాల్సి ఉందని చెప్పారు. కేవలం సంబంధిత మంత్రి తన ఇంట్లో బగ్గింగ్‌ పరికరాలు దొరకలేదని చెప్పడంతోనే సరిపోదని, అంతకు మించిన వివరణను ప్రభుత్వం నుంచి కోరుతున్నామని ఇతర ప్రతిపక్ష నేతలు కూడా డిమాండ్‌ చేశారు. బిజెపిపై అమెరికా నిఘా సంస్థల గూఢచర్యం సాగుతోందా? అనే ప్రశ్నకు విదేశాంగ శాఖ మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ అలాంటిదేమీ లేదన్నారు. అమెరికాకు బిజెపితో సత్సబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. బిజెపికి వనరులు ఉన్నాయని, ఏదైనా చేయగల శక్తి ఉందని, వారు తల్చుకుంటే ఏ విషయంపై అయినా దర్యాప్తు చేయగలరు, నిజాల నిగ్గు తేల్చగలరని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ హయాంలో బగ్గింగ్‌ జరిగినట్లు వచ్చిన ఆరోపణలను ఖుర్షీద్‌ ఖండించారు. బగ్గింగ్‌ తీవ్రమైన విషయమని, మంత్రి వివరణతో సరిపోదని, దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపాల్సిందేని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజరుసింగ్‌ డిమాండ్‌ చేశారు.  సీనియర్‌ మంత్రికే ఇలా జరిగితే ఇక ఈ దేశాన్ని ఆ దేవుడే రక్షించాలని దిగ్విజరు వ్యాఖ్యానించారు. బగ్గింగ్‌ జరిగే ఉంటుందని, దీనికి అమెరికా నిఘా సంస్థలే కారణమని బిజెపి నేత డాక్టర్‌ సుబ్రహ్మణ్య స్వామి విమర్శించారు. బిజెపి వంటి జాతీయవాద పార్టీలు అధికారంలోకి రావడం అమెరికాకు రుచించడం లేదన్నారు. ఇది ఇలా ఉండగా బగ్గింగ్‌ అనేదే జరగనప్పుడు ఇక దానిపై దర్యాప్తు ప్రసక్తే ఉండదని, అయినా ఈ వివాదంతో తమ మంత్రిత్వశాఖకు ఎలాంటి సంబంధం లేదని, తమను వదిలివేయాలని విలేకరులతో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రతిష్టకు ఎసరు పెట్టాలనే ఆలోచనతోనే కాంగ్రెస్‌ బగ్గింగ్‌ అంశాన్ని తెరపైకి తెచ్చిందని, ఇది అనవసర విషయమని బిజెపి తెలిపింది. ప్రాధాన్యత లేని అంశాలను ప్రస్తావించడం ద్వారా తమ పార్టీపై బురద చల్లాలని చూస్తున్నారని బిజెపి మీడియా ఇన్‌చార్జీ శ్రీకాంత్‌ శర్మ విమర్శించారు. ఎన్నికల పరాజయంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న కాంగ్రెస్‌, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ ఎత్తుగడలకు దిగిందని వ్యాఖ్యానించారు. 60 రోజుల్లోనే తమ ప్రభుత్వం ఘన విజయాలను సాధించిందని, వాటిని కప్పిపుచ్చేందుకు కావాలనే ఇతర విషయాలను ప్రస్తావిస్తున్నారని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: