ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగినంత కాలం తమ ప్రజాప్రతినిధులను, మంత్రులను కలుసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడే కష్టాలు ఎలా ఉన్నప్పటికీ ఉమ్మడి రాజధాని వల్ల ఒక ప్రయోజనం కూడా కొందరికి కలుగుతోంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒకే నగరంలో కలుసుకునే భాగ్యం వివిఐపి సందర్శకులకు దక్కుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావులను కలుసుకోవడానికి బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో పాటు విదేశీ ప్రముఖులు బారులు తీరుతున్నారు. అయితే వీరికి ఇద్దరు ముఖ్యమంత్రుల దర్శనం చాలా వేగంగా దొరుకుతోంది. ఉదాహరణకు, ఆదివారం హైదరాబాద్ విచ్చేసిన విప్రో గ్రూప్ చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ కొద్ది గంటల తేడాలోనే చంద్రబాబు నాయుడు, కెసిఆర్‌తో విడివిడిగా భేటీ అయ్యారు. విప్రో బాస్ తరహాలోనే అంతకు కొద్ది రోజుల ముందు రిలయన్ గ్రూప్ అధిపతి అనిల్ అంబానీ ఇద్దరు ముఖ్యమంత్రులతో వెంటవెంటనే సమావేశమయ్యారు. సింగపూర్ కాన్సలేట్ జనరల్ రాయ్ ఖో, మరి కొందరు పారిశ్రామికవేత్తలు, విదేశీ రాయబారులు ఇద్దరు ముఖ్యమంత్రులను తమ పర్యటనలో భాగంగా ఒకే నగరంలో కలుసుకోగలుగుతున్నారు. ప్రస్తుతం కెసిఆర్ మాత్రమే సచివాలయంలోని తన ఛాంబర్‌లో కూర్చుంటున్నారు. ఎపి సిఎం చంద్రబాబు మాత్రం సచివాలయంలో తన ఛాంబర్ ఇంకా తయారు కాకపోవడంతో లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌నే తన క్యాంపు కార్యాలయంగా ప్రస్తుతానికి ఉపయోగించుకుంటున్నారు. ఆయన కూడా సచివాలయంలోకి వచ్చేస్తే ఇక ఇద్దరు ముఖ్యమంత్రులను ఒకే భవన సముదాయంలో కలుసుకునే అవకాశం ప్రముఖులకు లభిస్తుంది. దీని వల్ల వారి సమయం కూడా ఆదా అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: