స్థానికత అంశం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి చిచ్చు పెడుతోంది. ఫీజు రీఎంబర్స్ మెంట్ వ్యవహారం క్రమంగా ముదురుతోంది. ఇంజినీరింగ్ అడ్మిషన్లకు సమయం దగ్గరపడటంతో.. బోధనం వస్తుందన్న ఆశతోనే ఇంజినీరింగ్ వంటి కోర్సుల్లో చేరిన తెలంగాణలోని ఆంధ్ర విద్యార్ధుల గుండెల్లో రాయిపడుతోంది. వాస్తవానికి వీరిని ఆంధ్ర విద్యార్థులు అని కూడా అనలేం. 1956 సర్టిఫికెట్ లేని తెలంగాణ విద్యార్థులు అంటే బావుంటుందేమో. తెలంగాణ సర్కారు 1956 సర్ఠిఫికెట్ అడుగుతుండటంతో.. దాదాపు 5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడబోతోంది. కేసీఆర్ సర్కారు 1956 నిబంధనపై ఏమాత్రం తగ్గేలా లేదు. అందుకే ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాన్ని రద్దు చేసి మరీ ఫాస్ట్ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తపడింది. ఇది కేవలం విద్యార్థులకు సాయం చేసే రాష్ట్ర కార్యక్రమమే కాబట్టి.. కేంద్రం జోక్యం చేసుకునే వీలు లేదు. ఇలాంటి నేపథ్యంలో..ఈ 5 లక్షల మంది విద్యార్థులు సాయం కోసం ఆంధ్రసర్కారు వైపు చూస్తూన్నా.. వారూ పట్టించుకునే అవకాశం కనిపించడం లేదు. ఇటు తెలంగాణ సర్కారు మే ఫీజు ఇవ్వమంటోంది. అటు ఆంధ్రాసర్కారు సాయం చేసే పరిస్థితి లేదు. మధ్యలో 5 లక్షల మంది జీవితాలు బలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై చంద్రబాబును విలేఖరులు ప్రశ్నిస్తే.. చట్టప్రకారమే స్థానికత వస్తుందని.. వ్యక్తుల ఇష్టాఇష్టాలను బట్టి కాదని కామెంట్ చేశారు. ఏడేళ్లలో నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులవుతారని లాజిక్కు చెప్పారు. కమలనాథన్ కమిటీ కూడా ఇదే చెప్పిందని.. మరో పాయింట్ చెప్పారు. అంతా కలసి అభివృద్ధి చేస్తేనే హైదరాబాద్ డెవలప్ అయ్యిందని మరో రొటీన్ డైలాగ్ చెప్పారు తప్ప.. ఈ 5 లక్షలమందిని ఆదుకునే బాధ్యత తీసుకుంటామని మాత్రం చెప్పలేదు. మరి ఈ చంద్రబాబు డైలాగులను కేసీఆర్ పట్టించుకుంటారా.. డౌటే..

మరింత సమాచారం తెలుసుకోండి: