దొంగలకు కోట్లు కురిపించిన దుంగలే ఇప్పుడు.. నవ్యాంధ్ర నిర్మాణానికి పునాదులుగా మారబోతున్నాయి. అంతర్జాతీయ స్మగ్లర్లను సైతం పరుగులు పెట్టించిన చెట్లు.. ఇప్పుడు కొత్త రాష్ట్రానికి కోట్లు కురిపించబోతున్నాయి. ప్రాణాలను పణంగా పెట్టి పోలీసులు పట్టుకున్న ఎర్రచందనం దుంగలు.. నవ్యాంధ్ర నిర్మాణ నిధులను కూడబెట్టబోతున్నాయి. కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన ఎర్రచందనం నిల్వలు... చంద్రబాబు హామీలను నిలబెట్టబోతున్నాయి. నవ్యాంధ్ర లోటు బడ్జెట్ పూడ్చుకునేందుకు.. ఎర్రచందనం నిల్వలే దిక్కని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రం ఉంది.. కానీ రాజధానిలేదు. ప్రభుత్వం ఉంది.. కానీ ప్రభుత్వ పాలనా కేంద్రం లేదు. హామీలు మిగిలే ఉన్నా.. వాటిని తీర్చేందుకు నిధులు లేవు. ఇదీ అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్ దుస్థితి. పురిటి బిడ్డగా మారి బుడిబుడి నడకలు వేయబోతున్న నవ్యాంధ్రకు నిధుల కొరత వేధిస్తోంది. దీనికితోడు అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ఇచ్చిన హామీలు రాష్ట్ర నిర్మాణానికి ఆశనిపాతంగా మారాయి. దీంతో ఏంచేయాలో తెలియక ప్రభుత్వం దిక్కుతోచని స్ధితిలో కొట్టుమిట్టాడుతోంది. నవ్యాంధ్ర నిర్మాణానికి నిధుల వెతుకులాటలో ఎర్రచందనం దుంగలు చీకట్లో చిరుదివ్వెల్లా మారాయి. కొత్త రాష్ట్ర నిర్మాణానికి ఎర్రచందనం దుంగలు కోట్లు కురిపించబోతున్నాయి. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న వేల టన్నుల ఎర్రచందనం నిల్వలను అమ్మడం ద్వారా కోట్లు రూపాయలు రాబట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ లో ఎర్రచందనానికి ఉన్న గిరాకీని బట్టి వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు. చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఎర్రచందనం చెట్లు విస్తరించి ఉన్నాయి. శేషాచలం అడవులతో పాటు కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో కలిపి మొత్తం 4.80 లక్షల హెక్టార్లలో ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. అయితే వీటికి అంతర్జాతీయంగా గిరాకీ ఉండటంతో పెద్ద ఎత్తున స్మగ్లర్లు ఈ చెట్లను నరికి విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఎర్రచందనం చెట్లను అంతరించే పోయే అరుదైన వృక్షజాతిగా కేంద్రం ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఎర్రచందనం చెట్ల విక్రయాన్ని సైటస్ అనే కేంద్ర సంస్ధ నిషేదించింది. అయితే ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమార్కులు అంతర్జాతీయ మాఫియాగా ఏర్పడి ఎర్రచందనం చెట్లను కబళిస్తున్నారు. శేషాచలం అడవుల్లో ఉన్న వేలాది ఎర్రచందనం చెట్లను నరికి విక్రయిస్తున్నారు. టన్ను ధర దాదాపు 32 లక్షల రూపాయల వరకు పలుకుతుండటంతో బడా స్మగ్లర్ల కన్ను ఎర్రచందనం చెట్లపై పడింది. దీంతో తమిళనాడు నుంచి కూలీలను దిగుమతి చేసుకొని ఎర్రచందనం చెట్లను నరికి చైనా, మయన్మార్, జపాన్, తూర్పు ఆసియా దేశాలకు తరలిస్తున్నారు. అక్కడ అంతర్జాతీయ మార్కెట్ లో లక్షలాది రూపాయలకు విక్రయిస్తున్నారు. అనతికాలంలోనే పెద్ద ఆదాయ వనరుగా ఈ ఎర్రచందనం చెట్లు మారడంతో బడా స్మగ్లర్లు ఇప్పుడు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారు. కొందరు రాజకీయ నాయకులు సైతం ఎర్రచందనం వ్యాపారం చేస్తూ ప్రభుత్వం హిట్ లిస్టులోకి ఎక్కారు. పదేళ్లుగా ఎర్రచందనం అక్రమ రవాణా రోజురోజుకు హెచ్చుమీరుతూ వచ్చింది. తొలుత అటవీ అధికారులు పెద్దగా పట్టించుకోకపోగా ఆ తరువాత వాటి విలువ తెలిసి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు నానా పాట్లు పడుతూ వచ్చారు. ఇందులో భాగంగా గడిచిన పదేళ్లలో వేల టన్నుల ఎర్రచందనం దుంగలను అటవీ, పోలీసు శాఖల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో దాదాపు పదిహేను వేల టన్నుల వరకు ఎర్రచందనం దుంగల నిల్వలు పేరుకుపోయాయి. వీటిని విక్రయించేందుకు గతంలో ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా పెద్దగా ఆచరణ సాధ్యం కాలేదు. దీంతో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... ఎర్రచందనం నిల్వలను విక్రయించి తద్వారా వచ్చే కోట్ల రూపాయలను నవ్యాంధ్ర నిర్మాణానికి వెచ్చించాలని యోచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనం టన్ను ధర 32 లక్షల రూపాయలు పలుకుతోంది. అయితే గ్లోబల్ టెండర్లు పిలవడం ద్వారా ఆ ధర యాభై లక్షల వరకు చేరుకునే అవకాశాలున్నాయి. దీంతో ప్రభుత్వ గోదాముల్లో మూలుగుతున్న ఎర్రచందనం దుంగలను విక్రయిస్తే దాదాపు అయిదు వేల కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో పాటు అటవీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా గ్లోబల్ టెండర్లపై దృష్టి సారించారు. ఇప్పటికే సైటస్ కేంద్ర సంస్థతో పాటు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎర్రచందనం నిల్వల లెక్కలను బయటికి తీయాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది. దీంతో అటవీ అధికారులు ఎర్రచందనం నిల్వల లెక్కల వెలికితీత పనిలో నిమగ్నమయ్యారు. స్మగ్లర్ల నుంచి పట్టుకున్న ఎర్రచందనం దుంగలే ఇప్పుడు నవ్యాంధ్ర నిర్మాణానికి ఆదాయ వనరుగా మారబోతున్నాయి. ఇప్పటికే అటవీ అధికారులు గోదాముల్లో ఉన్న ఎర్రచందనం నిల్వల లెక్కల తీసే పనిలో పడ్డారు. ఒక్క తిరుపతి అటవీ డివిజన్ లోనే దాదాపు 8600 టన్నుల ఎర్రచందనం నిల్వలు ఉన్నాయి. ఇక మిగిలిన అటవీ డివిజన్ల పరిధిలోనూ మరో 7000 టన్నుల వరకు ఎర్రచందనం నిల్వలు ఉన్నాయి. మొత్తం మీద వీటిని విక్రయిస్తే దాదాపు అయిదు వేల కోట్ల రూపాయల వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఆర్ధికమంత్రి యనమలతో పాటు అటవీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలు ఇప్పటికే కేంద్రప్రభుత్వంతో చర్చించి ఎగుమతులకు అవసరమైన అనుమతులను పొందేపనిలో నిమగ్నమయ్యారు. అలాగే రుణమాఫీకి తక్షణమే వేల కోట్ల రూపాయల నిధులు అవసరం ఉన్న నేపధ్యంలో ఎర్రచందనం నిల్వల అమ్మకం ద్వారా ఆ లోటును పూడ్చుకోవచ్చని చంద్రబాబు సర్కార్ యోచిస్తోంది. కేవలం ఎర్రచందనం దుంగలే కాకుండా వాటితో పాటు స్వాధీనం చేసుకున్న వాహనాలు కూడా వేలల్లో ఉన్నాయి. వీటిని కూడా విక్రయించి ఖజానా నింపుకోవాలని భావిస్తున్నారు. గ్లోబల్ టెండర్లను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. రెవెన్యూ లోటు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆదాయం పెంచుకునేందుకు ఎర్ర చందనం విక్రయించాలని నిర్ణయించింది. తాజాగా 8584 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అమ్మకానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇందులో బాగంగానే వీటి లెక్కింపు కార్యక్రమం మొదలయింది. ఈ ఎర్ర చందనం దుంగలను ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: