తెలుగుదేశం పార్టీలో సంస్థాగత మార్పులకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. అనుబంధ విభాగాల్లోనూ కొత్త కమిటీలు వేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలుగునాడు స్టూడెండ్స్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్)కు రెండు రాష్ట్రాల్లోనూ కమిటీలు వేస్తూ కొత్తగా కేంద్ర సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీని జాతీయ పార్టీగా మార్చుతామని చెప్పిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దీనిపై కసరత్తు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా టీడీపీ మూడు విభాగాలుగా మారబోతోంది. ఇరు రాష్ట్రాలకు ప్రత్యేక కమిటీలతో పాటు కేంద్ర కమిటీని అధినేత ఏర్పాటు చేయబోతున్నారు. పార్టీ విద్యార్థి విభాగం విభజన ద్వారా భవిష్యత్ లో పార్టీ రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయో అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపారు. టీఎన్ఎస్ఎఫ్ కు ఆంధ్ర ప్రదేశ్ కమిటీకి బ్రహ్మం చౌదరి, తెలంగాణకు మధుసుదన్ రెడ్డి, కేంద్ర కమిటీకి ప్రస్తుత టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న ఆంజనేయ గౌడ్ లను చంద్రబాబు నియమించారు. ఆంజనేయగౌడ్ ఇక పై ఇరు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. టీఎన్ఎస్ఎఫ్ తో మొదలైన ఈ ప్రక్రియ వచ్చే మే నాటికి పార్టీ మొత్తానికి వర్తింపజేసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. అన్నీ అనుబంధ విభాగాలతో పాటు రాష్ట్ర కమిటీ కూడా మూడుగా రూపాంతరం చెందబోతోంది. జాతీయ అధ్యక్షుడుగా చంద్రబాబు వ్యవహరిస్తారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలకు ప్రత్యేకంగా అధ్యక్షులు, కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తారు. కేంద్ర కమిటీలో ఇరు ప్రాంతాలకు చెందిన వారిని నియమిస్తారు. పొలిట్ బ్యూరో మాత్రం ఒక్కటే ఉంటుంది. ఇందులోనూ ఇరు రాష్ట్రాలకు సమ ప్రాధాన్యం ఇస్తారు. తెలంగాణకు ప్రస్తుతం ఎల్ రమణ అధ్యక్షుడుగా, ఎర్రబెల్లి దయాకర్ రావు వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ కమిటీలో కూడా వర్కింగ్ గ్రూప్ లో చురుకైన నేతలను ఎంపిక చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మండవ, మోత్కుపల్లి లాంటి నేతలకు ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. తెలంగాణలో రెడ్డి, బీసీ, ఎస్సీ కాంబినేషన్ తో వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేయాలన్న ఆలోచన పార్టీ ఉంది. ప్రస్తుతం అడహక్ కమిటీలను ఏర్పాటు చేసుకున్నా... మే నాటికి మెంబర్ షిప్ కూడా పూర్తి చేసుకుని పూర్తి స్థాయి కమిటీలను ఏర్పాటు చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: