దేశంలో పెను సంచలనం దూసుకొచ్చిన రాజకీయ కెరటం నరేంద్ర మోడీ. గుజరాత్ ను అభివృద్ది పథంలో తీసుకెళ్లిన మోడీని ప్రధానిగా అవకాశం ఇచ్చారు దేశ ప్రజలు. అయితే మోడీ పాలన మూడో నెలలోకి ప్రవేశించింది. అద్భుతాలు సృష్టిస్తాడనుకున్న మోడీ ఎటువంటి ప్రయత్నాలు మొదలు పెడతారోనని ఇప్పుడు దేశం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితో అటు మోడీని నుంచి ఇప్పటి వరకు ఊహించిన రెస్పాన్స్ రాక అంతా అయోమయంలో ఉన్నారు. రెండు నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ అన్న ఒకే ఒక వ్యక్తే సెంటరాఫ్ అట్రాక్షన్. మాట్లాడే మాట, వేసే అడుగూ అన్నీ సంచలనమే. ప్రచారంలో మూడు లక్షల కిలోమీటర్ల ప్రయాణం, వందలాది సభలకు హాజరు, ప్రత్యర్ధులు దిగమింగుకోవడానికి కూడా తంటాలు పడేంత స్థాయి పదునైన విమర్శలు, అభిమానులు ఎప్పుడు విని తరిద్దామా అని అనిపించే ప్రసంగాలు. అసలు బీజేపీ ప్రచారాన్నంతా తన భుజాల మీద వేసుకుని తిరిగిన మోడీ అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. మూడు దశాబ్దాల చరిత్రను తిరగరాస్తూ తన పార్టీని సొంతంగానే అధికారంలోకి తీసుకువచ్చి ప్రధాన మంత్రి పీఠాన్ని అధిష్టించారు. మోడీ ప్రభుత్వ పనితీరుపై భారత్ లో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నా.. విదేశాలు మాత్రం ఆయనకు జేజేలు పలుకుతున్నాయి. మోడీ సబ్ కా సాథ్ సబక్ వికాస్ నినాదాన్ని మెచ్చుకున్న అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ.. అభివృద్ధిలో అందరీని కలుపుకుపోవాలన్న ఆయన సంకల్పం నచ్చిందంటూ ప్రకటించారు. తాజాగా చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ అనే పత్రిక కూడా మోడీ బాగా కష్టపడుతున్నారంటూ కితాబిచ్చింది. పాత ప్రభుత్వం కాలం నుంచి పెండింగులో ఉన్న ఫైళ్లను కూడా చకచకా క్లియర్ చేసేస్తున్నారని, అధికారులంతా ఉదయం 9 గంటలకల్లా ఆఫీసుకు వచ్చి, సాయంత్రం 6 గంటల వరకు కచ్చితంగా ఉండేలా చేస్తున్నారని వివరించారు. ఏవైనా పనులుంటే 6 గంటల తర్వాత కూడా పనిచేయిస్తున్నారు. శనివారాలు కూడా అందరూ పని చేస్తున్నారని, అధికారులు ఏమైనా పని మిగిలిపోతే ఇళ్లకు ఫైళ్లు తీసుకెళ్తున్నారని చెప్పారు. తమ శాఖల కార్యాలయాల్లో ఎక్కడా దుమ్ము ఉండకుండా, పాత ఫర్నిచర్ మిగలకుండా, ఫైళ్లు డెస్కుల మీద ఉండకుండా, కిళ్లీ ఉమ్మేసిన మరకలు కనపడకుండా చూసుకోవాల్సిన బాధ్యతను ఆయా శాఖల కార్యదర్శులకు అప్పగించారని చెప్పారు. అంటూ మోడీని ఆ పత్రిక ప్రశంసించింది. సైలెన్స్ 'మోడీ' మోడీ పగ్గాలు చేపట్టి అప్పుడే రెండు నెలలు కూడా గడిచిపోయాయి. మరి ఈ రెండు నెలల పాలనలో మోడీ పని తీరుపై పెద్దగా విమర్శలు లేకున్నా.. ఆయన నోరు విప్పింది మాత్రం బహు స్వల్పం. బీజేపీ, ఎన్డీఏ పక్ష సమావేశాల్లో ఒకసారి, పార్లమెంట్ లో మరోసారి మాట్లాడిన మోడీ.. కేరళలో నావికా దళం నిర్వహించిన మరోసారి మాత్రమే నోరు విప్పారు. ఆ తర్వాత కూడా ఒకటీ రెండు సందర్భాల్లో మాత్రమే దర్శనమిచ్చారు. మాట్లాడే సందర్భాలను మినహాయిస్తే ముఖంలో కాసింత ముభావం పులుముకున్నట్లుగా కనిపించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ప్రధాని ఒకటి రెండు సార్లు మాత్రమే హాజరయ్యారు. ప్రధాని దేవుడిలా మారిపోయారని, పార్లమెంట్ కు రావడమే మానేసారని ప్రతిపక్షాలు విమర్శలు కూడా చేసాయి. సెల్ ఫోన్లు మన్ మోహన్ మోడ్ లో పెట్టుకోండి.. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఆయన మీద వచ్చిన జోక్ ఇది. అంతే కాదు. డెంటిస్టు మన్మోహన్ సింగ్ నిని "కనీసం పళ్లు పరీక్ష చేయడానికైనా నోరు తెరవండి మహాప్రభూ..."అన్నారని కూడా జోక్ ప్రచారంలో ఉంది. అంత మౌనంగా పదేళ్లు గడిపేశారు మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ నిశ్శబ్దంగా ఉంటే ఆయన్ని 'మౌన' మోహన్ సింగ్ అన్నారు. ఆయన తరువాత ప్రధాని అయిన నరేంద్ర మోడీ కూడా నిశ్శబ్దంగా ఉంటున్నారు. ఆయన తరఫు నుంచి మాటా లేదు, పలుకూ లేదు. ఎన్నికల ప్రచార సమయంలో రోజుకు నాలుగు సభల్లో మాట్లాడి, చాయ్ పే చర్చలు చేసిన మోడీ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అప్పుడప్పుడూ ట్వీట్లు తప్ప మాటలు ఎందుకు లేవు? సానియా వివాదంలో మోడీ ఒక్క మాట మాట్లాడితే గొడవ సర్దుకుపోయి ఉండేది. కానీ మోడీ నోరు విప్పలేదు. ఎన్నికల సమయంలో ప్రత్యర్ధులకు గుండెలు ధడేల్ మనేలా మాట్లాడారు మోడీ. మాటలను తూటాల్లో మార్చి ఒకసారి, సుతిమెత్తగా ఉంటూనే సూదుల్లా గుచ్చుతూ ఇంకోసారి.. ఎలా కావాలంటే అలా మాటలను వదలడంలో తనకు తానే సాటి అయిన మోడీ ఇప్పుడు కూడా అదే పదును చూపించాలి. దేశ ప్రజలకు ఇక ధైర్యం కలిగించే మాటలు, చేతలు చూపించాలి. ఊహించని మెజారీటీతో ఉక్కిరిబిక్కిరి చేసిన దేశ ప్రజల రుణం తీర్చుకునేలా మోడీ పనితీరు ఉండాలి. అప్పుడే దేశ ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: