మాసాయిపేట వద్ద రైలు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులకు ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ తరఫున ఆర్థిక సాయం అందించేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త నారా లోకేష్‌.. బుధవారం మెదక్‌ జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ప్రమాదంలో మృతి చెందిన పిల్లల కుటుంబాలకు ఈ సందర్భంగా లక్ష రూపాయల చొప్పున అందజేస్తారని టీడీపీ మీడియా కమిటీ చైర్మన్‌ ఎల్వీఎస్‌ఆర్‌కె ప్రసాద్‌ తెలిపారు. లోకేష్‌.. తూప్రాన్‌ మీదుగా ఇస్లాంపూర్‌, గున్‌రెడ్డి పల్లి, వెంకటాయపల్లి, కిష్టాపూర్‌, ఘనపూర్‌, వేలూరు గ్రామాలకు వెళ్లి బాధిత కుటుంబాలను కలుస్తారనిపేర్కొన్నారు. కాగా, గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి, ఇప్పటికే ట్రస్టు తరఫున రూ.50వేల చొప్పున అందజేశారు.  రెండు రాష్ట్రాల్లో విద్యారంగం పటిష్ఠానికి తెలుగునాడు స్టూడెంట్‌ ఫ్రంట్‌ (టీఎన్‌ఎస్‌ఎఫ్‌) కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్‌ నారా లోకేష్‌ పిలుపునిచ్చారు. మంగళవారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు ఆంజనేయగౌడ్‌ ఆధ్వర్యంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి, తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి.. తమకు బాధ్యతలు అప్పగించి కొత్త కమిటీలు వేసినందుకు లోకేష్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ, విద్యారంగం బలోపేతానికి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌ కోసం టీడీపీ అహర్నిశలు కృషి చేస్తుందని, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. విద్యార్థి విభాగమైన టీఎన్‌ఎస్‌ఎఫ్‌ను జాతీయస్థాయిలో బలమైన విద్యార్థి సంస్థగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సహకారం అందిస్తానని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: