తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్ష పదవికి నేతల ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఓవైపు అధిష్ఠానం కొంత మంది నేతలను ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడుతుండగా... మరోవైపు నేతలు ఎవరి స్థాయిలో వారు టీపీసీసీ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరికొంత మంది నేతలు మాత్రం ప్రస్తుత అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యనే కొనసాగించాలని అధిష్ఠానానికి విన్నవిస్తున్నారు. ఇదివరకు పార్టీ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తారంటూ వార్తలు వెలువడగా తాజాగా సీనియర్‌ నేత జి.వెంకటస్వామి కుమారుడు, మాజీ ఎంపీ జి.వివేక్‌ పేరు తెరపైకి వచ్చింది. గత కొంత కాలంగా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను మారుస్తున్నారన్న వార్తలు వెలువడుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో పీసీసీ పీఠం కోసం నేతల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మల్లు భట్టి విక్రమార్క, జి.వివేక్‌, జె.గీతారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ మళ్లీ బీసీకే పదవిని ఇవ్వదలిస్తే మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, మధు యాష్కీగౌడ్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. రెడ్డి సామాజికవర్గానికి పదవి ఇవ్వాలనుకుంటే డీకే అరుణ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎల్పీ నేతగా జానారెడ్డి ఉన్న నేపథ్యంలో బీసీ లేదా ఎస్సీ సామాజిక వర్గ నేతకు టీపీసీసీ పీఠం దక్కవచ్చని అంటున్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్‌ వాణిని బలంగా విన్పించే నేతను పీసీసీ పీఠంపై కూర్చుండబెట్టాలని పార్టీ వర్గాలు అధిష్ఠానానికి విన్నవిస్తున్నాయి. ఆర్థిక దన్నునూ పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. మరో పక్క సర్వే సత్యనారాయణ మాత్ర పొన్నాల లక్ష్మయ్యనే అధ్యక్షుడిగా కొనసాగించాలని అంటున్నారు. ఇదే విషయాన్ని తాను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి కూడా పొన్నాలనే సమర్థిస్తున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: