ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన రుణమాఫీపై గందరగోళ పరిస్థితి నెలకొంది. కొత్తగా రుణాలు లభించకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు రైతులకు రుణాలిచ్చే కార్యక్రమాన్ని బ్యాంకులు ప్రారంభించలేదు. గతంలో తీసుకున్న రుణాలను రైతులు చెల్లించినా, వారి తరఫున ప్రభుత్వం చెల్లించినా తాజాగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులకు వీలయ్యేది. 2013-14 సంవత్సరానికి సంబంధించిన పంట రుణాలను రైతులు జూన్‌లోగా తిరిగి చెల్లిస్తే, వారికి వడ్డీ మాఫీ ఇస్తూ వస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ‘వడ్డీలేని రుణ పథకం’ అమల్లోకి వచ్చింది. ఈ పథకం నియమావళి ప్రకారం ఒక ఏడాది జూన్ నుంచి మరుసటి ఏడాది జనవరిలోగా (ఎనిమిది నెలల కాలంలో) రుణాలు తీసుకునే రైతులు వాటిని తదుపరి ఏడాది జూన్ చివరిలోగా చెల్లిస్తే వడ్డీ మాఫీ పథకం వర్తింపచేస్తున్నారు. వడ్డీకి సంబంధించిన డబ్బును ప్రభుత్వమే బ్యాంకుల్లో జమచేస్తూ వస్తోంది. రైతులు జూన్‌లోగా రుణాలు తిరిగి చెల్లించకపోతే, జూలై ప్రారంభం కాగానే వడ్డీ మాఫీ పథకం రద్దై ఒక రూపాయి వడ్డీ విధించాలనేది వడ్డీలేని రుణాల పథకం నియమాళిలో ఉంది. 2013-14లో తీసుకున్న రుణాలను రైతులు ఎవరూ చెల్లించవద్దని ఎన్నికల ముందు రాష్టవ్య్రాప్తంగా పర్యటించిన సమయంలో చంద్రబాబు పదేపదే ప్రకటించారు. దాంతో ఆశపడిన రైతులు రుణాలను చెల్లించాలంటూ బ్యాంకు సిబ్బంది ఎక్కడ వత్తిడి తెస్తారోనన్న కారణంతో బ్యాంకులవైపు కనె్నత్తి కూడా చూడలేదు. బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతులందరూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే రుణాల మాఫీ జరుగుతుందని భావించారు. బ్యాంకులు మళ్లీ కొత్తగా రుణాలు ఇస్తాయని భావించిన రైతులకు ఇప్పటి వరకు నిరాశేమిగిలింది. రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించినట్టు 10 రోజుల క్రితమే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానం ఆమోదించినప్పటికీ, ఇప్పటి వరకు ఉత్తర్వులు (జీవో) జారీ కాలేదు. సాధారణంగా మంత్రివర్గ సమావేశంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తుంటారు. ఇందుకు విరుద్ధంగా రుణమాఫీపై మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఉత్తర్వులు జారీ కాకపోవడం గమనార్హం. రుణమాఫీ ఏవిధంగా చేయాలన్న అంశంపైనే ప్రభుత్వం వద్ద స్పష్టత లేదు. ఇప్పటి వరకు ఈ అంశంపై విధానపరమైన నిర్ణయం ఏదీ తీసుకోలేదు. రుణాలను ఖచ్చితంగా మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి సహా మంత్రులంతా పదే పదే హైదరాబాద్‌లోనూ, జిల్లాల పర్యటనల్లోనూ ప్రకటిస్తున్నప్పటికీ, విధానపరమైన నిర్ణయం మాత్రం ఇప్పటి వరకు తీసుకోలేదు. రీ షెడ్యూల్ వైపు చూపు రైతు రుణాలను మాఫీ చేసే పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడే సిద్ధంగా లేకపోవడంతో, రుణాల రీ షెడ్యూల్ పల్లవిని ప్రభుత్వం తాజాగా భుజాన వేసుకుంది. రుణాల రీ షెడ్యూల్ ఎంత త్వరగా అమల్లోకి వస్తే ప్రభుత్వానికి అంత స్పీడ్‌గా ఊరట లభించేది. పంట రుణాలను రీ షెడ్యూల్ చేస్తే, ఆ మొత్తాన్ని ఏడేళ్లలోగా చెల్లిస్తామని ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి భారతీయ రిజర్వ్ బ్యాంక్‌కు లేఖ రాశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండేది ఐదేళ్లే కనుక, మూడేళ్లలోగా రీ షెడ్యూల్ చేసిన రుణాలను తిరిగి చెల్లిస్తామంటూ లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని ఆర్బీఐ మెలికపెట్టింది. అంటే రుణాల మాఫీకి సంబంధించి ఏటా 13 వేల కోట్లు బ్యాంకర్లకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తం ఏటా కేటాయించడం సాధ్యం కాదని అధికారులు తేల్చిచెప్పడంతో ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకు ఆర్బీఐ గవర్నర్ అంగీకరించారని, ముఖ్యమంత్రికి ఫోన్‌లో ఈమేరకు హామీ ఇచ్చారంటూ 15 రోజుల క్రితమే ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఆర్బీఐ రీ షెడ్యూల్‌కు అంగీకరించకపోగా, అసలు పంట రుణాలను రీ షెడ్యూల్ చేసేందుకు నియమావళి అంగీకరించడం లేదని ప్రకటించేసింది. దాంతో ఏదోరకంగా పంట రుణాలను రీ షెడ్యూల్ చేయించుకునేందుకు ప్రభుత్వం తంటాలు పడుతోంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు ఆర్బీఐ మధ్య జరుగుతున్న ‘లేఖల యుద్ధం’ ఎప్పటికి ముగుస్తుందో, తమకు ఎప్పుడు రుణాలు లభిస్తాయోనని ‘చకోరపక్షు’ల్లా రైతులు ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: