ఎన్‌టిఆర్‌ సుజల స్రవంతి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మినరల్‌ వాటర్‌ పథకం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటర్‌ ప్లాంటు ఏర్పాటు బాధ్యతను సేవా కార్యక్రమాలు నిర్వహించే ట్రస్టులకు, కంపెనీలకు అప్పగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శుద్ధి చేసిన నీటిని 20 లీటర్లు రూ. 2కే అందజేస్తామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. ఈ పేరుతో తాగునీటి సరఫరా బాధ్యతల నుంచి తప్పుకో జూస్తోంది. మంచినీటి వనరులను ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నట్లు స్పష్టమవుతోంది. అయినా ఈ పథకంపై పునరాలోచన చేయడం లేదు. ఇప్పటికే పలు గ్రామాల్లో ప్రైవేట్‌ సంస్థలు, ట్రస్టులు మినరల్‌ వాటర్‌ స్కీములను నిర్వహిస్తున్నాయి. చంద్రబాబు స్వగ్రామమైన చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో ఎన్‌టిఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో వాటర్‌ ప్లాంటు ఏర్పాటు చేశారు. చంద్రగిరి నియోజకర్గంలో కొటాల, బుచ్చినాయుడు కండ్రిగ తదితర గ్రామాల్లోనూ ఎన్‌టిఆర్‌ సుజల పథకాలు నడుస్తున్నాయి. ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నారావారిపల్లి, కొటాల గ్రామాల్లోని ఎన్‌టిఆర్‌ సుజల పథకాన్ని ప్రజాశక్తి పరిశీలించింది. మూడేళ్ల క్రితం నారావారిపల్లిలో ఎన్‌టిఆర్‌ ట్రస్టు మినరల్‌ వాటర్‌ ప్లాంటు ఏర్పాటు చేసింది. చంద్రబాబు నాయుడి తండ్రి నారా ఖర్జూరనాయుడు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ ప్లాంటులో సొంత గ్రామస్తులకూ ఉచితంగా నీళ్లు ఇవ్వడం లేదు. నారావారిపల్లి ప్రజలైనా 20 లీటర్ల క్యానుకు రూ. 2 చెల్లించాల్సిందే. 'రోజుకు ఒక క్యాను వంతున నెలకు 30 క్యాన్ల నీళ్లు వాడుతున్నాం. అంటే నెలకు రూ. 60 నీళ్లకు చెల్లిస్తున్నాం. ఎండాకాలంలో రెండు క్యాన్లు అవసరమయ్యాయి. రూ.120 ఖర్చయింది' అని ఆ పల్లెకు చెందిన ఓ మహిళ వివరించారు. ప్లాంటు వద్దకు వచ్చి నీళ్లు తీసుకెళ్లలేని వారికి ఓ ప్రైవేట్‌ వ్యక్తి ఆటోలో తీసుకెళ్లి ఇస్తున్నారు. క్యానుకు రూ. 5 వసూలు చేస్తున్నారు. ఇంకాస్త దూరంగా ఉన్న గ్రామాల్లో క్యాను రూ. 8 దాకా అమ్ముతున్నారు. నీళ్లు ఉచితంగా ఇవ్వొచ్చుగదా అంటే... ''నిర్వహణ ఖర్చులకైనా రావాలి కదా సార్‌ ! నాకు జీతం నాలుగు వేలు ఇస్తున్నారు. కరెంటు బిల్లు రూ.2 వేలకుపైగా వస్తుంది. ఇంకా ఫిల్టర్లు మార్చాలి. కెమికల్‌ కొనుగోలు చేయాలి!''అని చెప్పుకొచ్చారు ప్లాంటులో పని చేస్తున్న గాయత్రి. నారావారిపల్లి ప్లాంటు విజయవంతంగా నడుస్తోందిగానీ నీళ్ల కోసం నెలనెలా రూ.60 ఖర్చు చేయకతప్పడం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఈ పరిస్థితిలో మార్పులేదు. ఇదే చంద్రగిరి మండలంలోని కొటాలలో ఎన్‌టిఆర్‌ సుజల ప్లాంటు ఏర్పాటు చేశారు. ఇక్కడ 20 లీటర్ల క్యానుకు రూ.3 వసూలు చేస్తున్నారు. రూ.2లకే 20 లీటర్ల నీరు అని ప్రభుత్వం చెబుతున్నదానికి భిన్నమైంది. దాదాపు రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్లాంటు సక్రమంగా పని చేయడం లేదు. కొటాలలో 300కు పైగా ఇళ్లు ఉంటే 50 కుటుంబాలు మాత్రమే ఈ ప్లాంటు నుంచి నీళ్లు తీసుకెళుతున్నాయి. ప్రజాశక్తి ప్రతినిధి ఆ గ్రామాన్ని సందర్శించిన సమయంలోనే పలువురు మహిళలు ట్యాంకు వద్ద ఉన్న బోరు మోటారు నుంచి నీళ్లు తీసుకెళుతూ కనిపించారు. ప్లాంటులో సక్రమంగా నీళ్లు ఇవ్వడం లేదని కొందరు, తాగునీటికి డబ్బులు ఎందుకు చెల్లించాలని ఇంకొందరు ఎన్‌టిఆర్‌ సుజల నీటిని తీసుకోవడం లేదు. ఇక చిత్తూరు జిల్లాలో పలు గ్రామాల్లో ప్రైవేట్‌ వ్యక్తులు, స్విస్‌ అనే సంస్థ వాటర్‌ ప్లాంట్లు నిర్వహిస్తున్నాయి. ఇవి ఒక్కోచోట ఒక్కో ధర వసూలు చేస్తున్నాయి. క్యాను రూ. 5-10 వసూలు చేస్తున్న ప్లాంట్లూ ఉన్నాయి. అందుకే ప్రభుత్వం ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకుని, సమగ్రమైన అధ్యయనం చేసిన తరువాత ఎన్‌టిఆర్‌ సుజల పథకం నియమ నిబంధనలు రూపొందిం చాల్సిన అవసరముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: