రాష్ట్రవిభజన పూర్తయి 2 నెలలు పూర్తవుతున్నా ఇంకా రెండు రాష్ట్రాల మధ్య గొడవలు ఓ కొలిక్కి వస్తున్నట్టు లేవు. అటు పాలకుల నుంచి ఇటు ఉద్యోగులు వరకూ అంతటా అదే పంచాయతీ. అసెంబ్లీ విభజన సరిగ్గా జరగలేదని ప్రజాప్రతినిధులు కొట్టుకుంటుంటే.. ఇక ఉద్యోగులు వాళ్లు ఊరుకుంటారా.. ఉద్యోగుల మధ్య ఇప్పటికే అనేక విషయాల్లో బేధాభిప్రాయాలున్నాయి. ఇప్పుడు కొత్తగా మరో పంచాయతీ వచ్చి పడింది. అదే తెలంగాణ, ఆంధ్ర పోలీసులు మధ్య బిల్డింగ్ పంచాయతీ. విభజనలో భాగంగా సీఐడీ కొత్త బిల్డింగును ఏపీ పోలీస్ డీజీపీ కార్యాలయంగా మార్చారు. పాత డీజీపీ కార్యాలయాన్ని తెలంగాణకు కేటాయించారు. ఆంధ్ర సీఐడీ డిపార్ట మెంట్ కోసం పాత సీఐడీ కార్యాలయాన్ని, తెలంగాణ సీఐడీ కోసం తెలంగాణ డీజీపీ కార్యాలయంలోని మూడో ఫ్లోర్‌ను కేటాయించారు. ఈ విభజనపై అసంతృప్తిగా ఉన్న ఆంధ్రా పోలీసులు.. పాత డీజీపీ కార్యాలయాన్ని తమకు కేటాయించాలని కోరుతున్నారు. ఈ మేరకు గవర్నర్ కు లేఖలు రాశారు. ఐతే, పాత డీజీపీ కార్యాలయాన్ని వదులుకునేందుకు తెలంగాణ పోలీసులు సిద్దంగా లేరు. బ్రిటీష్ కాలం నాటి ఈ పురాతన కట్టడం తమకే చెందాలని వారు వాదిస్తున్నారు. నూట పదిహేనేళ్ల నాటి ఈ పురాతన కట్టడం ఇంకా పటిష్టంగానే ఉండటం విశేషం. ఇది సెంటిమెంట్ పరంగా చూసినా.. తమకే చెందాలంటున్నారు తెలంగాణ పోలీసులు. బ్రిటీష్ కాలం నుంచి నిజాం రాజులు, తెలంగాణ పోలీస్‌శాఖ వరకు ప్రత్యేకమైన నేపథ్యం ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ఈ భవనం వదులుకోబోమని వారు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: