హెడ్డింగ్ చూసి.. ఇదేదో పొలిటికల్ సునామీ అని కంగారుపడిపోకండి. అంత సీన్ అసలే లేదు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో... రాష్ట్రం తరహాలోనే పార్టీని కూడా విభజించాలని చంద్రబాబు డిసైడయ్యారు. అందులో భాగంగానే ఈ పార్టీ విభజన ప్రక్రియ. పార్టీ అంటే పార్టీ ఒక్కటే కాదు కదా. చాలా అనుబంధ విభాగాలుంటాయి. విద్యార్థి సమాఖ్య, ట్రేడ్ యూనియన్, మహిళావిభాగం, ఎస్టీఎస్సీ సెల్.. ఇలా చాలా ఉంటాయి. రాష్ట్రవిభజన నేపథ్యంలో ఇప్పుడు అవి కూడా రెండు ముక్కలు కాబోతున్నాయన్నమాట. తెలుగునాడు విద్యార్థి సమాఖ్యతో పార్టీలోని విభాగాల విభజనను ప్రారంభించిన చంద్రాబాబు.. రెండు రాష్ట్రాలకు రెండు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తారు. అంతే కాదు.. వీటితో పాటు జాతీయ కమిటీని త్వరలోనే ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. లీడర్లతో పాటు క్యాడర్ ఉన్న పార్టీగా టీడీపీకి మంచి పేరుంది. ఆ క్యాడర్లో ఈ అనుబంధ విభాగాలూ ఓ భాగమే. తెలుగుదేశం పార్టీకి ఆయువుపట్టుగా ఉన్న అనుబంధ విభాగాలైన తెలుగు యువత, తెలుగు మహిళ, టీఎన్ ఎస్ ఎఫ్, తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం, తెలుగునాడు ట్రేడ్ యూనియన్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బిసీ సెల్.. ఇలాంటివన్నీ ఇక రెండు రాష్ట్రాలకు వేరు వేరుగా ఉండబోతున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ విభజన ప్రక్రియ అంతా చినబాబు లోకేశ్ చూస్తున్నారట. ఈ ప్రక్రియను మొదట టీ ఎన్ ఎస్ ఎఫ్ తో ప్రారంభించారు. ఇప్పటివరకు ఒకే విభాగంగా ఉన్న టి ఎన్ ఎస్ ఎఫ్ ఇప్పుడు మూడు కమిటీలుగా విభజించి అభ్యర్థులను ఎంపిక చేయటంలో లోకేశే కీలక పాత్ర పోషించారు. రాష్ట్రం విడిపోయిన తరువాత పార్టీ కమిటిలు కలిసి ఉంటే సమస్యలు, వివాదాలు తలెత్తుతాయనే అభిప్రాయం వ్యక్తమైంది. దాని ఫలితమే ఈ విభజన. రెండు రాష్ట్రాలకు వేరు వేరుగా కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తే పార్టీలోనూ నూతన ఉత్సాహం వస్తుందని టీడీపీ నేతలు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: