ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో ఆకర్షణీయపథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రైతుకు ఆదునిక పరిజ్ఞాన్ని అందించే లక్ష్యంతో ప్రతిరైతుకూ ఓ ఐప్యాడ్ ఉచితంగా ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. త్వరలోనే పొలం పిలుస్తోంది పేరుతో ఏపీ సర్కారు ఓ కార్యక్రమం నిర్వహించబోతోంది. అందులో భాగంగానే రైతుకు ఐప్యాడ్ అందివ్వాలని చంద్రబాబు ఆలోచన. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా రైతు సంఘాల ప్రతినిధులతో చెప్పారు. రుణమాఫీ చేసినందుకు కృతజ్ఞతగా తనను కలిసేందుకు వచ్చిన వారితో చంద్రబాబు అనేక విషయాలపై మాట్లాడారు. భూసార పంటలు, సాగుయోగ్యమైన పంటల నిర్థరణ, మేలైన విత్తనాలు, ఎరువుల మార్కెటింగ్, వాతావరణ విశేషాలు వంటి సమాచారం ఎప్పటికప్పుడు రైతుకు కరతామలకంగా ఉండాలని.. అందుకు ఐప్యాడ్ అందిస్తే మేలని చంద్రబాబు అన్నారట. గత పదేళ్లలో రాష్ట్ట్ర, కేంద్రప్రభుత్వాల అశాస్త్రీయ విధానాల వల్ల వ్యవసాయ పరిశోధనలు ఆగిపోయాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఆదాయం పెంచడమే తన లక్ష్యమంటున్న చంద్రబాబు...సాగను లాభదాయకంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నారు. గత తొమ్మిదేళ్ల పాలనలో రైతు వ్యతిరేకి అన్న అపవాదు మూటగట్టించుకున్న చంద్రబాబు.. ఈదఫా పాలన మొదటి నుంచే అలాంటి బ్యాడ్ నేమ్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అంతేకాదు.. రైతు బాంధవుడిగా పేరు తెచ్చుకుంటే.. పొలిటకల్ ఫ్యూచర్ కు ఢోకా ఉండదని భావిస్తున్నారు. అందుకే అధికారంలోకి వచ్చీ రావడంతోనే రుణమాఫీ విషయంపై కసరత్తు చేశారు. మొత్తానికి దాన్ని ఓ దరికి తెచ్చారు. ఇక ఉపాధి హామీని వ్యసాయంతో అనుసంధానించాలన్నది చంద్రబాబు మరో ఆలోచన. ఇది కూడా సాకారమైతే.. రైతుల్లో చంద్రబాబు ఇమేజ్ అమాంతం పెరిగే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: