తమపై అప్పుడే జనాలకు కోపం తగ్గిపోయిందని.. ప్రజలు తమ విలువను అప్పుడే గుర్తించారని అంటోని కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు ఆ పార్టీ నేతలు ప్రకటనలు చేయడం మొదలు పెట్టారు. తమను తిరిగి ప్రజలు ఆదరించడం మొదలు పెట్టారని వారు అంటున్నారు. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. జనరల్ ఎలక్షన్స్ లో ప్రజలు తమను దారుణంగా ఓడించినా.. ఇప్పుడు మాత్రం పరిస్థితిలో మార్పు వచ్చిందని ఆయన అంటున్నాడు! మరి ప్రజల్లో మీపై కోపం తగ్గిందని మీకెలా తెలుసు సార్? అంటే... అందుకు ఉత్తరాఖండ్ లో జరిగిన ఉప ఎన్నికలే రుజువు అని ఆయన చెబుతున్నాడు. అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని.. మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే మూడింటినీ కాంగ్రెస్ సొంతం చేసుకొందని అంతకంటే.. ఏం రుజువు కావాలని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నాడు. ప్రజల్లో ఇప్పడు కాంగ్రెస్ పై ఎలాంటి వ్యతిరేకత లేదని. అదంతా ముగిసిన అధ్యాయం అని చవాన్ చెప్పుకొస్తున్నాడు! మరి చవాన్ మాటలు అయితే బాగానే ఉన్నాయి. మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలిచే సరికే... 500 లకు పైగా ఎంపీ స్థానాల్లో ఓడిపోయిన విషయం పెద్దది కాదని తేల్చేస్తున్నాడు. అయ్యగారి కాన్ఫిడెన్స్ భారీ స్థాయిలోనే ఉందనుకోవాల్సి వస్తోంది. మరి త్వరలోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పదిహేనేళ్లుగా కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో అధికారం చెలాయిస్తోంది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచే అవకాశమే లేదనే అభిప్రాయాలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. చవాన్ మాత్రం ప్రజల్లో అప్పుడే తమపై వ్యతిరేకత తగ్గిపోయిందని అంటున్నాడు. ఇలాంటి నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికల్లో గనుక కాంగ్రెస్ గెలిస్తే.. అప్పుడు చవాన్ మాటలు నిజం అవుతాయి! కాకపోతే... ప్రజల్లో కాంగ్రెస్ పై కోపం కొనసాగుతోందని అనుకోవాల్సి వస్తుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: