తెలంగాణలోనూ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు దాటింది. కానీ ఇంతకాలం అధికార పక్షాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పెద్దగా విమర్శించింది లేదు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న వాటిల్లో లోపాలను వెతకడంతోపాటు... ఇచ్చిన హామీల పైనా ప్రతిపక్ష వైసీపీతోపాటు అధినేత జగన్ సైతం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కానీ తెలంగాణలో మాత్రం ప్రతిపక్షం లేదేమో అన్న రీతిలో కేసీఆర్ పాలన ఈ రెండు నెలలూ కొనసాగింది. తాజాగా టీసీఎల్పీ నేత, టీపీసీసీ అధ్యక్షులు చేసిన విమర్శలు అధికార టీఆర్ఎస్ తో యుద్ధానికి తెరతీశాయి. రుణమాఫీ విషయంలో స్పష్టత లేదని... కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ సరికాదని అని టీసీఎల్పీ నేత జానారెడ్డి చేసిన విమర్శల పై టీఆర్ఎస్ నేతలు మూకుమ్మడి దాడి చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ను సైతం టీఆర్ఎస్ మంత్రులు వదల్లేదు. కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం పై చేసిన విమర్శలు పెద్దగా ప్రచారంలోకి రాలేదు. కానీ టీఆర్ఎస్ నాయకులు చేసిన ప్రతి విమర్శలు మాత్రం పతాక శీర్షికలకు ఎక్కాయి. సీఎల్పీ నేత జానారెడ్డి రాజకీయ జీవితం త్రిశంకు స్వర్గంలో ఉందని మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ప్రజా సమస్యలు పట్టించుకోని జానారెడ్డికి... కేసీఆర్ ను విమర్శించే అర్హత లేదని అన్నారు. చంద్రబాబుతో కుమ్ముక్కై విమర్శలు చేయడం సరికాదని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. విద్యా శాఖ మంత్రి కాంగ్రెస్ నేతల పై విరుచుకుపడ్డ వెంటనే... మరో మంత్రి హరీష్ రావు సైతం అంతేస్థాయిలో ప్రతి విమర్శలకు దిగారు. కేసీఆర్ కు పాలన తెలియదు అన్నట్లు జానారెడ్డి మాట్లాడడంపై హరీష్ మండిపడ్డారు. ప్రజలకు ఎవరేమిటో తెలుసని... అందుకే తమను అధికార పక్షంలో కూర్చోబెట్టారని చెప్పారు. ఏదీ చేతకాదనే కాంగ్రెస్ ను ప్రతిపక్షం పాలు చేశారని అన్నారు. పొన్నాల లక్ష్మయ్య పార్టీలో ఉనికి కోసమే పనికిరాని విమర్శలు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ నేతలను మాత్రమే కాదు... బీజేపీ నాయకులను సైతం విడిచిపెట్టలేదు. ఇంతకాలం పెద్దగా మాటల యుద్ధం కనిపించని తెలంగాణలో ఇక ముందు ఇరుపక్షాల మధ్య ఆరని చిచ్చు రగులుకోక తప్పదేమో...

మరింత సమాచారం తెలుసుకోండి: