మూడుసార్లు ఒలంపిక్స్ హాకీలో బంగారు పతకాన్ని భారత ఖాతాలో చేర్చిన క్రీడా శిఖరం ద్యాన్ చంద్. ఈ హాకీ దిగ్గజానికి దక్కాల్సిన భారత రత్న అవార్డు దారిమళ్లిందా...? ప్రభుత్వ పథకం ప్రకారమే సచిన్ కు రిటైర్మెంట్ రోజున భారతరత్నను కట్టబెట్టిందా...? అవుననే సమాధానం చెప్తున్నాయి పీఎంఓ కార్యాలయంలోని అంతర్గత పత్రాలు. గతేడాది నవంబర్ 16 న సచిన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. అదేరోజున కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించింది. అయితే ఈ అవార్డు దివంగత హాకీ ఆటగాడు ధ్యాన్ చంద్ కు దక్కాల్సిందనే విషయం తాజాగా బయటికొచ్చింది. సచిన్ టెండూల్కర్... అసమాన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో భారత క్రికెట్ కీర్తిని ఇనుమడింప జేసిన వ్యక్తి. కలలో కూడా చెరపలేని రికార్డులతో సుదీర్ఘంగా ఆటలో కొనసాగిన కలికుతురాయి. దాదాపు పాతికేళ్ల ప్రస్థానంలో సాధించలేనిదంటూ ఏదీ లేకుండా సుసాధ్యం చేసిన నాటి, నేటి మేటి ఆటగాడు సచిన్. గతేడాది ఆటకు వీడ్కోలు పలికిన టెండూల్కర్... భావోద్వేగాల్లో మునిగి ఉండగానే, అనూహ్యమైన వార్త అందింది! అది... సచిన్‌ టెండూల్కర్‌కు ‘భారత రత్న’. సచిన్‌ కెరీర్‌కు యూపీఏ ప్రభుత్వం ఇలా ఘనమైన వీడ్కోలు పలికింది. అయితే క్రీడాకారులకు కూడా ‘భారతరత్న’ ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తూ 2011లోనే సవరణలు చేశారు. ఈ అత్యున్నత పురస్కారం పొందే తొలి క్రీడాకారుడు ధ్యాన్ చంద్ అని అనుకున్నారు. దాన్ని బలపరుస్తూ ధ్యాన్ చంద్ కు భారతరత్నా ఇవ్వాలని కోరుతూ గతేడాది జులై 16 న క్రీడా శాఖ ప్రధానికి లేఖరాసింది కూడా. కానీ అకస్మాత్తుగా నవంబర్ 14 న సచిన్ క్రీడా వివరాలు 24 గంటల్లో కావాలంటూ పీఎంఓ నుంచి క్రీడా మంత్రిత్వ శాఖను ఆదేశాలు అందాయి. నవంబర్ 15 న వివరాలు తీసుకున్న పీఎంఓ... సచిన్ కు భారతరత్న ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి సంపాధించింది. నవంబర్ 16 న అంటే సచిన్ రిటైర్మెంట్ రోజున సగర్వంగా ప్రకటించింది. అయితే... భారత హాకీని అంతర్జాతీయ స్థాయిలో మెరిపించిన ఆటగాడు ధ్యాన్ చంద్. 1928, 32, 36 ఒలంపిక్స్ లో భారత్ హాకీలో స్వర్ణ పతకం సాధించడంలో ధ్యాన్ చంద్ పాత్ర మరువలేనిది. 1979లో ధ్యాన్ చంద్ కన్నుమూశారు. సచిన్, ధ్యాన్ చంద్... ఇద్దరూ క్రీడా దిగ్గజాలే. ఆటతో దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు మూటగట్టిన జాతి రత్నాలే. కానీ ఒకరికి దక్కాల్సిన భారతరత్నం... మరొకరి ఇంటికి చేరడమే బాధాకరం.

మరింత సమాచారం తెలుసుకోండి: