వైసీపీ అధినేత జగన్ కు ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. పార్టీలో సర్వం సహాధిపత్యాన్ని చెలాయిస్తూ.. ఎదురు తిరిగిన వారిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తూ.. తిరుగులేని రీతిలో హవా నడిపిస్తున్న జగన్ కు.. ఓ చోటామోటా నేత ఊహించని రీతిలో షాకిచ్చారు. పైగా.. ఎవరికైతే పూర్తిగా క్లాస్ తీసుకుందామని మీటింగ్ పెట్టారో.. అదే మీటింగ్ లో.. 13 జిల్లాల కేడర్ సాక్షిగా ఓ సాదాసీదా నేత... అధినేతకు క్లాస్ తీసుకున్నారు. మరి ఆ క్లాసేంటో.. ఆ కథేంటో ఇప్పుడు చుద్దాం.. బాధ్యతాయుతమై ప్రతిపక్షంగా ఉన్నప్పుడు... ఏ పని చేయడానికైనా ఓ పద్ధతుండాలి, మనకంటూ ఓ స్టయిల్ ఉండాలి. అది అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే నిరసన కార్యక్రమమైనా... లేక ప్రజల పక్షాన నిలిచి సాగించే పోరాటమైనా కావచ్చు. ఏదైనా సరే... దానికి కారణం బలంగా ఉండాలి. జనం చేతే కాదు... పార్టీ వారితో సైతం గుడ్డిగా అవుననిపించే చక్కటి రీజనింగ్ ఉండాలి. ఫలానా కార్యక్రమం ద్వారా తాము సాధించాలనుకున్నదేమిటి? ప్రజలకు మేలు చేయడమా లేక ప్రభుత్వాన్ని వీలైనంతగా బజారుకి ఈడ్చడమా అనే విషయంలో స్పష్టమైన అవగాహన ఉండాలి. తాము చేపట్టబోయే నిరసన లేదా ఆందోళనను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి.. అందులో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనేలా చేయడానికి ఏం చెయ్యాలనే విషయంలో చక్కటి ప్లానింగ్ ఉండాలి. దీనికితోడు పార్టీ కేడర్ కు దీనిపై మంచి అవగాహన కలిగిలే చేసి.. వారిని కార్యోన్ముఖులను చెయ్యాలి. అన్నింటికీ మించి అసలు జనం మూడ్ ఎలా ఉందనేది ఓ అధినేతగా అంచనా వెయ్యగలగాలి. అసలిప్పుడు నిరసనలు, ఆందోళనలు అంటే ఎవరైనా ముందుకొస్తారా.. ప్రభుత్వంపై దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అనేది కూడా జాగ్రత్తగా గమనించాలి. అంతే కానీ.. ఎవరి అభిప్రాయాలు తెలుసుకోకుండా.. ఎవరినీ సలహా అడగకుండా.. లేడికి లేచిందే పరుగన్నట్టుగా.. అర్జెంటుగా నిరసన జెండాలు పట్టుకుని రోడ్ల మీదకు పరుగుతీస్తే ఎలా ఉంటుంది? వైసీపీ అధినేత జగన్ ఇటీవల సరిగ్గా ఇలాగే చేశారు. రైతు రుణ మాఫీపై వైసీపీ చేసిన ఆందోళన ఏ విధంగా అభాసుపాలైందో అందరికీ తెలిసిన విషయమే. వెళకాని వేళ నరకాసుర వథంటూ ఆయన చేపట్టిన కారక్యక్రమంపై జోకులు కూడా బాగానే పేలాయి. పోనీ ఆ తర్వాతైనా యువనేత తన పంథా మార్చుకున్నారా అంటే అదేమీ లేదు. పైగా... కార్యకర్తలు సరిగా పనిచెయ్యకపోవడం వల్లే అలా జరిగిందని ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఏపిలోని పదమూడు జిల్లాల అధ్యక్షులతో తాజాగా ఓ మీటింగ్ పెట్టి.. పార్టీ జిల్లా శాఖల అధ్యక్షులకు క్లాస్ పీకడం మొదలెట్టారు. దీంతో.. కొందరు నేతలకు చిర్రెత్తుకొచ్చింది. చేసిందంతా చేసేసి... ఇప్పుడు తగుదునమ్మా అంటూ మమ్మల్నే బ్లేమ్ చేస్తారా అని అనుకున్నారో ఏమో తెలీదు కానీ.. ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ఓ నేత... జగన్ ఆవేశానికి అడ్డు తగిలారు. ''సార్.. అసలు అందరికన్నా ముందు మీరు మారాలి..'' అంటూ షాకిచ్చారు. దీంతో జగన్ కంగుతిన్నా... వెంటనే కొంచెం సర్దుకుని... ఏం మారాలో చెప్పండన్నా అంటూ బోల్డంత కూల్ గా రిక్వెస్ట్ చేశారు. అప్పుడు ఆ నేత తన వాక్ప్రవాహాన్ని కొనసాగిస్తూ.. సార్ మీరు మమ్మల్ని జిల్లాల్లో అధ్యక్షులుగా నియమించారు కానీ... మీరు మాతో ఎప్పుడైనా మాట్లాడారా? ఏ విషయంలో అయినా మా అభిప్రాయాలు తెలుసుకున్నారా? జిల్లాలో మీకు దగ్గరగా ఉండే నాయకులతోనే ఎప్పుడూ మాట్లాడుతూ వచ్చారు. అంతెందుకు.. రైతుల రుణమాఫీ పై మనం ఆందోళనలు చేపడుతున్నామనే విషయం.. టీవీలో చూస్తే కానీ మాకు తెలియలేదు. అసలు ఈ విషయంలో ఆందోళనలు ఇప్పుడు చేద్దామా వద్దా, పరిస్దితులు ఎలా ఉన్నాయి. జనం మూడ్ ఎలా ఉంది. జిల్లాల్లో రైతుల రియాక్షన్ ఎలా ఉందనేది మీరు ఒక్క సారైనా మమ్మల్ని అడగలేదు అని సదరు నేత జగన్ ను నిలదీశారు. ఎన్నికల సమయంలో కూడా ఎవరికి టిక్కెట్లు ఇవ్వొచ్చు... గెలుపు అవకాశాలు ఎవరికి ఎలా ఉన్నాయనేది మాతో కనీసం మాట మాత్రంగానైనా మాట్లాడలేదని ఆయన ఆవేదనను వెళ్ళబోసుకున్నారట. అంతా మీరే చేశారు. అవును అంతా మీరే చేశారు. అన్న డైలాగ్ వినగానే ఎవరికైనా ఓ హిట్ సినిమా టక్కున గుర్తుకొస్తుంది. అందులో... కొడుకుకు క్లాస్ పీకుదామని సిద్ధమైన తండ్రికి... ఊహించని రీతిలో కొడుకే రివర్స్ లో క్లాస్ తీసుకుంటాడు. బాగా పాపులర్ అయిన ఆ డైలాగ్.. ఆ సన్నివేశం.. ఆ సినిమాలో టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత నుంచి మొత్తం కథే మారిపోతుంది. సరిగ్గా అలాగే కాకపోయినా... కొంచెం అటూ ఇటూగా జగన్ కు సొంత పార్టీ నేతే రివర్స్ లో క్లాస్ తీసుకోవడం.. అంతా మీరే చేశారంటూ వాస్తవాలను ఆవిష్కరించే ప్రయత్నం చేయడం వైసీపీలో కూడా టర్నింగ్ పాయింట్ అవుతుందా? ఇక నుంచి జగన్ పూర్తిగా మారిపోయి... అన్ని విషయాల్లోనూ అందరితోనూ సంప్రదిస్తూ... పార్టీ శ్రేణుల మనసు దోచుకునే ప్రయత్నం చేస్తారా? లేక.. సినిమా సినిమానే.. వాస్తవం వాస్తవమే అన్నట్టుగా... వైసీపీలో యధాపూర్వ స్థితి నిరాటంకంగా కొనసాగుతుందా అనేది చూడాలి. అయితే.. మీటింగ్ చివర్లో మాత్రం.. ఇకనుంచి అన్ని విషయాల్లోనూ మీతో సంప్రదిస్తానని జగన్ హామీ ఇచ్చి అందరినీ సంతోష పెట్టే ప్రయత్నం చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: