విద్యుత్ చార్జీలను పెంచే విషయమై రాష్ట్రప్రభుత్వం ముందడుగు వేయలేకపోతోంది. ఈ విషయమై విద్యుత్ శాఖలో, ప్రభుత్వంలో తీవ్ర స్ధాయిలో అంతర్మథనం, తర్జనభర్జన జరుగుతోంది. విభజన వల్ల విద్యుత్ చార్జీలను పెంచుతూ టారిఫ్ ఆర్డర్‌ను ప్రకటించలేనని ఏపిఇఆర్‌సి ఇదివరకే స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను దాదాపు తొమ్మిదివేల కోట్ల రూపాయల మేర పెంచాలని నాలుగు డిస్కాంలు ఏపిఇఆర్‌సికి ప్రతిపాదనలు ఇచ్చాయి. బహిరంగ విచారణ జరిగి టారిఫ్ ఆర్డర్‌ను ప్రకటించే సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికల సమయంలో టారిఫ్ ఆర్డర్ ప్రకటించేందుకు వీలు లేదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్ర విభజన తతంగం ప్రారంభమైంది. జూన్ 2వ తేదీన విభజన జరిగిన తర్వాత ఏపిఇఆర్‌సి టారిఫ్ ఆర్డర్‌ను జారీచేయలేనని పేర్కొంది. రెండు రాష్ట్రాలు తాజాప్రతిపాదనలు ఇస్తే బహిరంగ విచారణ చేసి కొత్తగా టారిఫ్ ఆర్డర్ ఇస్తానని పేర్కొంది. విభజనతో సంబంధంలేకుండా ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోని డిస్కాంలు 9 వేల కోట్ల రూపాయల మేర విద్యుత్ చార్జీలను పెంచాల్సిన అవసరం ఉందని విద్యుత్ నిపుణులంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్ వరకు ఏపిఇఆర్‌సి రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది. డిసెంబర్ 2వ తేదీ లోపల తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రానికి కొత్తగా విద్యుత్ నియంత్రణ మండలిని ఏర్పాటు చేయనుంది. కొత్త ఇఆర్‌సి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో డిస్కాంలు, ట్రాన్స్‌కో టారిఫ్ ప్రతిపాదనలు ఇఆర్‌సికి సమర్పించే అవకాశం ఉంది. కాగా ఆంధ్రరాష్ట్రంలో మాత్రం ఆర్ధికంగా అనేక కష్టాలను ఎదుర్కొంటోంది. రెవెన్యూ లోటుతో పాటు విద్యుత్ రంగంలో మార్పులు తీసుకుని వచ్చి 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలంటే ఆ దిశగా ఆధునీకరించాల్సి ఉంటుంది. విశాఖపట్నంలోని తూర్పు డిస్కాం, తిరుపతిలోని సదరన్ డిస్కాంల పరిధిలో 13 జిల్లాలు ఉన్నాయి. విజయవాడలో సెంట్రల్ డిస్కాంను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 4500 కోట్ల రూపాయల మేర విద్యుత్ చార్జీలను పెంచేందుకు వీలుగా ప్రతిపాదనలు తయారుచేసే విషయమై డిస్కాంలు మల్లగుల్లాలు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే ఆగస్టు 31వ తేదీలోపల ఏపిఇఆర్‌సికి తాజా ప్రతిపాదనలు ఇచ్చే అవకాశం ఉంది. తనకు ప్రతిపాదనలు అందినప్పటి నుంచి నెలరోజుల్లోగా బహిరంగ విచారణ జరిపి టారిఫ్ ఆర్డర్‌ను ప్రకటించేందుకు వీలుందని సమాచారం. సవరించిన విద్యుత్ చార్జీలను అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి అమలులోకి తేవచ్చు. ఆంధ్రరాష్ట్రంలో ఉచితవిద్యుత్‌కు సాలీనా పదివేల ఎంయు విద్యుత్ అవసరమవుతుంది. పరిశ్రమలు తక్కువైనందు వల్ల క్రాస్ సబ్సిడీ భారం ప్రభుత్వంపై పడనుంది. ఈ ఏడాదికి 2500 కోట్ల రూపాయలైనా చార్జీల భారం వేస్తే, వచ్చే ఏడాది మూడు నాలుగువేల కోట్ల భారం విధించినా వినియోగదారుడికి ఆగ్రహం రాకపోవచ్చని విద్యుత్ అధికారులంటున్నారు. యూనిట్‌కు కనీసం 50 పైసలు పెంచినా డిస్కాంలు కోలుకుంటాయంటున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలు చేస్తే ఆరు నెలల్లో కొంతలో కొంత నష్టాన్ని పూడ్చుకోవచ్చనే ఆశతో విద్యుత్ శాఖ ఉంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ప్రధానమైన సమస్యలు ఏవీ కొలిక్కి రాలేదు. రైతుల రుణమాఫీ, వృద్ధులు, వికలాంగులు, వితంతవుల పెన్షన్ సంగతి తేలలేదు. రాజధాని ఎక్కడో ఖరారుకాలేదు. ఈ అంశాల్లో జరుగుతున్న జాప్యంపై ప్రజల్లో ఆగ్రహం ఉంది. ఈ పరిస్ధితుల్లో విద్యుత్ చార్జీలను పెంచితే ప్రజల్లో కోపం కట్టలు తెచ్చుకుంటుంది. కాని నాణ్యమైన విద్యుత్ 24 గంటల సేపు సరఫరా చేయాలంటే కచ్చితంగా నిధులు అవసరమవుతాయి. 2013లో పెంచిన చార్జీలతో నాణ్యమైన విద్యుత్ సరఫరా అంటే కుదరదనివిద్యుత్ నిపుణులంటున్నారు. ఇప్పటికే విద్యుత్ కేటాయింపుల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదుచేసిన విషయం విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: