చేతిలో అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేసుకుంటూ పోతే కుదరదని తెలంగాణ సీఎం కేసీఆర్ కు క్రమంగా అర్ధమయ్యే రోజులు వస్తున్నాయి. సీఎం కుర్చీ ఎక్కిన దగ్గర నుంచీ తెగ హడావిడి చేస్తున్న కేసీఆర్ దూకుడుకు చెక్ పెట్టే వ్యవస్థలు రాజ్యాంగంలో ఉన్నాయన్న సంగతిని హైకోర్టు గుర్తు చేసింది. సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చే వాహనాలకు తెలంగాణలో పన్నులు వేసేందుకు ఉద్దేశించిన తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంలో ఉమ్మడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. అసలు విషయం ఏంటంటే.. ఒక రాష్ట్రం వాహనాలు.. వేరే రాష్ట్రంలో తిరిగేందుకు పన్ను చెల్లించాలి. సమైక్య రాష్ట్రం విడిపోతున్నందువల్ల.. ఈ పన్ను బాదుడు నుంచిప్రజలకు తాత్కాలిక ఉపశమనం కలిగించేందుకు.. మార్చి 2015 వరకూ రెండు రాష్ట్రాల మధ్య పన్నులు లేకుండానే వాహనాలు తిరిగేలా.. ఉమ్మడి ప్రభుత్వంలో గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు జీవోనెం 43 విడుదల చేశారు. ఐతే.. విశేషమేమిటంటే.. రాష్ట్రం రెండుముక్కలు కావడానికి సరిగ్గా ఒకే ఒక్క రోజు ముందు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇది కేసీఆర్ సర్కారకు కోపం తెప్పించింది. ఆ జీవోకు సవరణ చేస్తూ... ఆంధ్రావాహనాలకు పన్ను వసూలు చేసేలా తాజాగా జీవో ఇచ్చారు. ఈ జీవోపై మండిపడిన సీమాంధ్ర వాహనదారులు, వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. ఉమ్మడి రాష్ట్రం తీసుకున్న నిర్ణయాలను ఇరు రాష్ట్రాలు గౌరవించాలని హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు.. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధాని కనుక.. తమ రాజధానిలోకి తమ వాహనాలు వచ్చినందుకు పన్నెందుకు కట్టాలని ఆంధ్ర మంత్రులు మండిపడుతున్నారు. ఈ జీవోపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఇంతలోనే హైకోర్టు తెలంగాణ సర్కారు జీవోకు అడ్డుకట్ట వేసింది. బోధనం వంటి మిగిలిన విషయాల్లోనూ ఇష్టారాజ్యంగా నిబంధనలు విధిస్తే.. కోర్టుల నుంచి ఇలాంటి మొట్టికాయలే వస్తాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: