"ఈ ప్రపంచంలో తెలుగు వాళ్లు ఎక్కడున్నా.. వాళ్ల కోసం పాటు పడతాం, వాళ్లను మా వాళ్లే అనుకొంటాం..'' అని అంటున్నాడు లోకేశ్ బాబు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి తనయుడు అయిన లోకేశ్ ఈవిధంగా ప్రకటన చేయడం మంచిదే. తెలుగుదేశం పార్టీ అని పేరు పెట్టుకొన్నందున.. తెలుగు వాళ్లందరిపై తమకు బాధ్యత ఉంటుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరి ఈ బాధ్యతను లక్ష రూపాయల సాయం చేసే విషయంలోనే గాక.. ఇతర వ్యవహారాల్లోకూడా తీసుకొంటే చాలా బాగుంటుంది. ముందుగా హైదరాబాద్ సెటిలర్ల విషయంలో తీసుకోవాలి తెలుగుదేశం పార్టీ. 1956 కు ముందుతెలంగాణలో సెటిలయిన వాళ్లకు తప్ప మిగిలిన వాళ్లెవ్వరికీ ఇక్కడి ప్రభుత్వ పథకాలను వర్తింపజేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇష్టపడటం లేదు. మరి ఇది తప్పా.. ఒప్పా.. అనే విషయాలను పక్కనపెడితే.. ఈ వ్యవహారంలో కేసీఆర్ ను దూషించే సంగతిని కాసేపు పక్కనపెట్టి.. ఈ వ్యవహారంలో తెలుగుదేశం తగు రీతిలో వ్యవహరించాలనే విషయాన్ని గుర్తెరగాలి. సెటిలర్ల విషయంలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం తన బాధ్యతను నిర్వర్తించాలి. తెలంగాణ ప్రభుత్వంతో చర్చలకు ముందుకురావాలి. అందుకోసం తెలుగుదేశం అధినేత, సీమాంధ్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు చొరవచూపాలి. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితిల మధ్య ఎన్ని రాజకీయ వైరుధ్యాలు ఉన్నా.. వాటిని పక్కనపెట్టి.. ఒక అడుగు దిగి వచ్చి అయినా సరే చర్చలకు చేతులు చాచాలి. ఈ వ్యవహారంలో కేసీఆర్ ఎలాగూ చొరవచూపడు. ఎందుకంటే ఆయనకు ఆ అవసరం లేదు. అవసరం తెలుగు వాళ్లది.. 1956 తర్వాత హైదరాబాద్ తదితర తెలంగాణ ప్రాంతాల్లో స్థిరపడ్డ తెలుగు వాళ్ల సమస్య ఇది. ఇప్పుడు వాళ్లు భారతదేశంలో బతుకుతూ కూడాప్రభుత్వ పథకాలకు అర్హత కోల్పోయే వాళ్లు అవుతారు. కాబట్టి.. తెలుగు వాళ్లు ఎక్కడ ఉన్నా బాధ్యత తీసుకొంటామనే తెలుగుదేశం వాళ్లు.. ఇప్పుడు ప్రభుత్వం తరపున ముందుకు రావాలి. తెలంగాణ ప్రభుత్వంతో చర్చించాలి.. తెలుగువాళ్లను రక్షించుకోవాలి. లోకేశ్ బాబు ఈ వ్యహారంపై దృష్టి సారించి మరిన్ని మంచి మార్కులు పొందవచ్చు! మరి ఈ ప్రయత్నం జరుగుతుందా?!

మరింత సమాచారం తెలుసుకోండి: