దాయాదుల మధ్య తగవులు తప్పవు. కుటుంబ పరంగా నైనా, దేశాల మధ్య నైనా ఇది కచ్చితంగా జరిగే పని. అవిభక్త భారతదేశంగా ఉండి.. రెండుగా విడిపోయిన ఇండియా, పాకిస్తాన్ ల మధ్య దశాబ్దాలుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పలు మార్లు యుద్ధం కూడా జరిగింది. అయినప్పటికీ శాంతి నెలకొనడం లేదు! సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించిన ఈ రెండు దేశాలుకూడా "చర్చలు'' అనే కార్యక్రమాన్ని తప్పనిసరిగా పెట్టుకొంటాయి. ఎంతటి ఉద్రిక్త పరిస్థితుల్లోనైనా విదేశాంగ శాఖలు చర్చించుకొందామంటూ పిలుపులను ఇచ్చి పుచ్చుకొంటుంటాయి. ఒకరి వల్ల మరొకరికి ఎంత నష్టం జరుగుతూ ఉన్నా.. ప్రాణాలను తీసుకనే శత్రుత్వం ఉన్నా... భారత్ ,పాక్ లు అనేక మార్లు చర్చలకు తలుపులు తీశాయి! అయితే ఈ మాత్రం స్నేహపూర్వక వాతావరణం లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ప్రభుత్వాల మధ్య ! ఒకరిపై ఒకరిది ప్రతీకారేచ్ఛ! విధాన పరంగా, చట్టాల ద్వారా.. ఎంత సేపూ అవతలి వారిని ఎలా దెబ్బతీయాలి? అనే ఆలోచిస్తున్నట్టుగా ఉన్నారు ముఖ్యమంత్రులిద్దరు. డిస్కంలతో చంద్రబాబు నాయుడు ఒప్పందాలు రద్దు చేసుకోవడం ద్వారా తెలంగాణను దెబ్బతీయాలని భావిస్తే.. సింగరేణి బొగ్గును సీమాంధ్రలోని థర్మల్ కేంద్రాలకు పంపిణీ చేయడానికి ఆపాలని కేసీఆర్ భావిస్తున్నాడు. అక్కడితో మొదలు అనేక రకాలుగా.. ఇరు ప్రభుత్వాలూ తమ శక్తి మేర అవతలి వారిని దెబ్బకొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. తమ సత్తాలను చాటుతున్నాయి. మరిఈ పరిస్థితిలో ఎప్పుడు మార్పు వస్తుందో అర్థం కావడం లేదు. ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులూ చెరో పార్టీ అధినేతలుగా ఉన్నారు. దీంతో.. వీరివురి మధ్య సఖ్యత కుదరడటం కష్టమైపోయింది. తమ తమ రాజకీయప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. ఈ నేతలు ప్రభుత్వాలను నడుపుతున్నట్టుగా ఉన్నారు. ఇది కచ్చితంగా ప్రజాగ్రహానికి దారితీసే పరిణామమే! వీళ్ల రాజకీయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే.. చివరకు ఈ రాజకీయనేతల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడిపోవడం ఖాయం!

మరింత సమాచారం తెలుసుకోండి: