ఇప్పుడైతే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ప్రభావితం చేశాడని అంటున్నారు కానీ... నిజంగా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజూ ప్రభుత్వ వ్యవహారాల్లోజగన్ పేరు వినిపించలేదు. వైఎస్సార్ మరణించేంత వరకూ , అంతకు ముందు జగన్ ఎంపీగా పోటీ చేసేంత వరకూ కూడా ఆయనెవరో తెలిసింది తక్కువమందికే! తన వ్యాపారాలేవో జగన్ వాటిని చూసుకొనే వాడు. ఏ రోజు కూడా ఫలానా మంత్రితో సమావేశం అయినట్టుగా కానీ, మంత్రులపై ఒత్తిడి తీసుకు వచ్చినట్టుగా కానీ, జీవోల విషయంలో కానీ జగన్ పేరు వినిపించలేదు. ఇప్పటికీ చెబుతుంటాడు జగన్ మోహన్ రెడ్డి.. నేను ఏ రోజూ సెక్రటేరియట్ లో అడుగుపెట్టలేదు, ఏ ఒక్క ఐఏఎస్ కూ ఫోన్ కూడా చేయలేదు.. అలాంటిది క్విడ్ ప్రో కో ఎలా జరిగిందని అంటారు? అని. సీబీఐ కేసుల్లో జగన్ న్యాయవాదులు ఆయన తరపున ఇదే వాదన వినిపిస్తూ ఉంటారు. మరి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ప్రస్థానం అలాంటిది అయితే.. ఇప్పడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడుతనయుడి వ్యవహారం మరోలా ఉంది! ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు అయినా గడిచిందో లేదో కానీ.. అప్పుడే లోకేశ్ మంత్రుల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాడట. తమ పీఆర్ వోలను నియమించుకోవడంలో కూడా ఉపముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు స్వేచ్ఛలేకుండా పోతోందని సమాచారం! మరీ ఇంత తొందరగా లోకేశ్ కు ఇలాంటి పేరు రావడం అంతమంచిది కాదని చెప్పవచ్చు. ఒకవర్గం మీడియాలోనేమో ఇది లోకేశ్ ప్రభుత్వంపై, పార్టీపై పట్టుపెంచుకోవడానికి నిదర్శనం అనే వార్తలు వస్తున్నప్పటికీ.. లోకేశ్ రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతున్నాడు అనే అభిప్రాయాన్ని కల్గిస్తున్నాయి ఈ పరిణామాలు! మరి లోకేశ్ జోక్యం తెలుగుదేశాన్ని తిరుగులేని శక్తిగా తయారు చేస్తుందా? లేక బలహీన పరుస్తుందా? అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: