పార్లమెంటును గ్రామ పంచాయతీ స్థాయికి దిగజార్చటాన్ని ఎం.పిలు ఇకనైనా మానుకోవాలి. గ్రామ పంచాయితీ స్థాయి అంశాలను పార్లమెంటుకు తీసుకురాకూడదు. ఇలా చేయటం వల్ల పార్లమెంటు పరువు, ప్రతిష్ఠ దిగజారతాయనే వాస్తవాన్ని ఎం.పిలు ఇప్పుడు కూడా గ్రహించకపోతే ఎలా? 16వ లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 332 మంది కొత్త సభ్యలు పార్లమెంటులో అడుగుపెట్టారు. వీరంతా పార్లమెంటు పట్ల ఒక ఉన్నతాభిప్రాయంతో ఢిల్లీకి వచ్చారు. రెండు మామూలు అంశాల మూలంగా పార్లమెంటు ఉభయ సభలు నాలుగైదు రోజుల పాటు స్తంభించిపోవటం కొత్త సభ్యులను ఆశ్చర్యపరిచాయి. ముంబాయికి చెందిన ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్టు వేద్ ప్రకాశ్ వైదిక్ తన పాకిస్తాన్ యాత్ర సందర్భంగా లష్కరే తొయ్యబా అధినేత హఫీజ్ సరుూద్‌ను కరాచీలో కలుసుకోవటం, ఇజ్రాయిల్ సైన్యం పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై బాంబుల వర్షం కురిపించిన సంఘటనలు పార్లమెంటు ఉభయ సభలను నాలుగైదు రోజుల పాటు కుదిపేశాయి. ఈ రెండు సంఘటనలకు ప్రతిపక్షం, పత్రికలు ఇంత ప్రాధాన్యత ఇవ్వలసిన అవసరం ఎంత మాత్రం లేదు. ప్రతిపక్షం తమ రాజకీయావసరాల దృష్టా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వాన్ని ఇరకాటంలోపడవేసేందుకు ఈ రెండు సంఘటనలను ఉపయోగించుకున్నది. పత్రికలు కూడా వైదిక్ వ్యవహారాన్ని పతాక శీర్షికన ప్రచురించటం ద్వారా పరిస్థితిని మరింత గందరగోళంలో పడవేశాయి. ఇజ్రాయిల్ దళాలు పాలస్తీనాపై దాడులు చేయటాన్ని పార్లమెంటులో ఖండించటం ద్వారా దేశంలోని ముస్లిం మైనారిటీల మెప్పు సంపాదించటమే ప్రధాన లక్ష్యంగా ప్రతిపక్షం వ్యవహరించింది. సూడో లౌకికవాదానికి పెద్ద పీట వేసే కాంగ్రెస్, సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్‌తోపాటు వామపక్షాలు కూడా ఇజ్రాయిల్ దాడులను తమ రాజకీయ ప్రయోజనాల కోసం దురుపయోగం చేసేందుకు ప్రయత్నించాయి. ఇజ్రాయిల్ దేశానికి చెందిన ముగ్గురు యువకులను పాలస్తీనాకు చెందిన హమ్మాస్ ఉగ్రవాద సంస్థ కిడ్నాప్ చేసి హతమార్చిందన్నది అరోపణ. హమ్మాస్ ముగ్గురు ఇజ్రాయిలీ యువకులను కిడ్నాప్ చేసి హత్య చేయటం ఎంత దుర్మార్గమో ఇజ్రాయిల్ సైన్యం గాజాపై విమానదాడులు చేస్తూ అమాయకులను హతమార్చటం కూడా అంతే దుర్మార్గం. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేయటం ద్వారా ముస్లిం మైనారిటీల మెప్పు పొందటమే లక్ష్యం కాబట్టి మొత్తం ప్రతిపక్షమంతా ఏకమై గొడవ చేసింది. ఈ రెండు సంఘటనలను ఖండించటం మినహా మనం చేయగలిగిందేమీ లేనప్పుడు దీని కోసం ఇంత రాద్ధాతం ఎందుకు? పార్లమెంటులో చర్చకు పట్టుపట్టినంత మాత్రాన ముస్లిం మైనారిటీలందరు ఈ పార్టీలను మెచ్చుకుంటారనుకోవటం ఒట్టి భ్రమే. ప్రచార పిచ్చి ఉన్న వయసు మళ్లిన జర్నలిస్టు వేద్ ప్రకాశ్ చేసిన నిర్వాకానికి పార్లమెంటును బలి చేయటం ప్రతిపక్షానికి ఎంత మాత్రం తగదు. హఫీజ్ సరుూద్‌ను కలుసుకున్నట్లు వైదిక్ వెల్లడించనంత వరకు దీని గురించి ఎవ్వరికీ ఏమీ తెలియదు. వైదిక పత్రికల్లో ప్రచారం కోసం తాను హఫీజ్ సరుూద్‌ను కలిసినప్పడు తీయించుకున్న ఫోటోను ఫేస్ బుక్‌లో పెట్టటంతోపాటు పత్రికలకు విడుదల చేశారనేది పచ్చి నిజం. పాకిస్తాన్‌లో తిష్టవేసిన ఇస్లామిక్ తీవ్రవాదులతోతెర వెనక చర్చ జరిపేందుకే నరేంద్ర మోదీ ప్రభుత్వం వైదిక్‌ను రంగంలోకి దించిందంటూ ప్రతిపక్షం ఆరోపించటం విచిత్రం. భారత, పాకిస్తాన్ మైత్రీ సంఘం పాకిస్తాన్‌లో ఏర్పాటు చేసిన ఒక సమావేశానికి హాజరయ్యేందుకు వైదిక్‌తోపాటు కాంగ్రెస్ నాయకులు సల్మాన్ ఖుర్షీద్ తదితరులు కూడా అక్కడికి వెళ్లారు. వారు రెండు,మూడు రోజుల్లో స్వదేశానికి తిరిగి వస్తే వైదిక్ మాత్రం రెండు వారాల పాటు అక్కడే ఉండి హఫీజ్ సైరుూద్‌తోపాటు పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాష్ షరీఫ్ తదితరులను కలిసి వచ్చారు. వైదిక్ ఒక జర్నలిస్టుగా వీలుంటే ఎవరినైనా, ఎక్కడైనా కలుసుకోవచ్చు. వైదిక్ లాహోర్ పర్యటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్.డి.ఏ ప్రభుత్వం పార్లమెంటు లోపల, బైట స్పష్టం చేసింది. ప్రతిపక్షం వైదిక్ సంఘటనను అడ్డం పెట్టుకుని ఎన్.డి.ఏ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసిందుకు ప్రయత్నించింది తప్ప వైదిక్ పాకిస్తాన్ పర్యటన పూర్వపరాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించలేదు. వైదిక్ పాకిస్తాన్ పర్యటనతో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకపోవచ్చు కానీ ఆయన పర్యటన గురించి తెలియకపోవటం ఏమిటి? తెలుసుకునేందుకు ప్రయత్నించకపోవటం ఏమిటి? పాకిస్తాన్‌కు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసే నిఘా సంస్థలు, ముఖ్యంగా రీసర్చ్ అండ అనాలసిస్ (రా) ఏం చేస్తోంనేది ప్రతిపక్షం ఎందుకు ప్రశ్నించలేదు. వైదిక్ పాకిస్తాన్ పర్యటన సంధర్భంగా హఫీజ్, నవాష్ షరీఫ్‌తోపాటు పలువురు ఇతరులను కలుసుకోవటం గురించి నిఘా సంస్థలకు తెలియకపోవటం మామూలు విషయం కాదు. పాకిస్తాన్ గూడచార సంస్థ ఐ.ఎస్.ఐ అనుమతి లేనిదే ఆ దేశానికి చెందిన ఏ ఒక్కరు కూడా వేదిక్‌కు సహాయం చేయలేరు. వైదిక్ పలు రోజుల పాటు పాకిస్తాన్‌లో ఉండి ఇంత మందిని కలిసి వచ్చేలా చేయటం వెనక ఐ.ఎస్.ఐ హస్తం ఉండటం గురించి ప్రతిపక్షాలు ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయలేదు. ప్రభుత్వాన్ని అర్థవంతంగా విమర్శించటం, వాస్తవాల ఆధారంగా ఆరోపణలు చేయటం ప్రతిపక్షం ప్రధాన బాధ్యత వాస్తవాన్ని ఎప్పుడు గ్రహిస్తారు?

మరింత సమాచారం తెలుసుకోండి: