విపత్తు మండలాల్లో రైతు రుణాల రీషెడ్యూల్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వ పాత్రపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. కరువు, వరదల వల్ల పంటలు నష్ట పోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రంపై కూడా ఉందని అధికారులు చెబుతు న్నారు. ఏదేని రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జాతీయ విపత్తు నిధి నుంచి ఉదారంగా సాయం చేయడంతో పాటు, బాధితులకు ఉపశమనం కలిగించే రుణాల రీషెడ్యూల్‌ వంటివి అమలు చేయాల్సిన కనీస కర్తవ్యం కేంద్రం నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు కేంద్రం స్పందించి సహాయ పునరావాస కార్యక్ర మాలు చేపట్టడం ఆనవాయితీ. కాగా విపత్తు ప్రాంతాల్లో రైతుల పంట రుణాల రీషెడ్యూల్‌ వ్యవహారం కేవలం రాష్ట్రాలు, రిజర్వ్‌ బ్యాంక్‌పై నెట్టి కేంద్రం చోద్యం చూడటంపై రెండు రాష్ట్రాల అధికారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆర్‌బిఐతో మాట్లాడి రుణాల రీషెడ్యూల్‌ చేయించాలని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సిఎం కెసిఆర్‌ కనీసం మాట వరసకైనా కేంద్రాన్ని అడగకపోవడాన్ని తప్పుపడుతున్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వంలో భాగం పంచుకున్న ఎపి సిఎం చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించో మెప్పించో ఒత్తిడి తెచ్చో రుణాల రీషెడ్యూల్‌పై ఆర్‌బిఐ సానుకూలంగా స్పందించేలా ప్రయత్నించాల్సి ఉండగా ఆ పని చేయట్లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేవలం ఆర్‌బిఐకి లేఖలు రాసి చేతులు దులుపుకోవడం మినహా కేంద్ర జోక్యానికి చంద్రబాబు ప్రయత్నించట్లేదని ఒకరిద్దరు అధికారులు బహిరంగంగానే చెప్పారు. నిరుడు ఖరీఫ్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫైలిన్‌ తుపాను, అనంతరం కురిసిన భారీ వర్షాలకు 30 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు నాటి ప్రభుత్వం అంచనా వేసింది. పంట నష్టం విలువ రూ.6,400 కోట్లుగా పేర్కొంటూ సాయం అందించాలని ఆ సంవత్సరం నవంబర్‌లో రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందానికి వినతిపత్రం అందజేసింది. రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం త్వరలో కేంద్రానికి నివేదిక ఇస్తామంది. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా 801 వరద మండలాలను ప్రకటిస్తూ 2014 జనవరి 23న ఉత్తర్వులు జారీ చేసింది. పరిశేష ఆంధ్రప్రదేశ్‌లో 464 మండలాలు ఉన్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా నుంచి కలిపిన మండలాలతో కలిపితే అవి 469కి చేరాయి. ఇవి 11 జిల్లాల్లో ఉన్నాయి. ఇదిలా ఉండగా గత సంవత్సరం 119 మండలాల్లో కరువు ప్రకటించారు. పరిశేష ఎపిలో 113 కరువు మండలాలు ఉన్నాయి. సమైక్య రాష్ట్రంలో మొత్తంగా 20 లక్షల ఎకరాల్లో కరువు వల్ల పంట నష్టం జరిగింది. సుమారు రూ. వెయ్యికోట్లు సాయం చేయాలని అప్పటి సర్కారు కేంద్రాన్ని కోరింది. విభజన బిల్లు ఆమోదించాక రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న సమయంలో ఈ ఏడాది ఏప్రిల్‌ మాసంలో కేంద్ర బృందం కరువు ప్రాంతాల్లో పర్యటించింది. రెండు తడవలు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందాలు ఏం నివేదికలిచ్చాయో ఎవ్వరికీ తెలీదు. ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు వాటి గురించి పట్టించుకోలేదు. కేంద్రం ఇప్పటి వరకు రూపాయి విదిల్చలేదు. ఒక వేళ కేంద్రం నిధులు ఇవ్వకపోతే రైతులకు వందల కోట్ల రూపాయల ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించాల్సిన బాధ్యత ఎక్కడ తమ మీద పడుతుందోనని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాత్మక నిశ్శబ్ధం పాటిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. కేంద్ర బృందాలు నివేదిక ఇస్తే అవి ఆర్‌బిఐకి కూడా వెళతాయని, తప్పనిసరిగా రుణాలు రీషెడ్యూల్‌ చేయాల్సిందేనని చెబుతున్నారు. రుణ మాఫీ చేస్తామన్న చంద్రబాబు, కెసిఆర్‌ కేంద్ర బృందాల నివేదికలు, పై నుంచి అందాల్సిన సాయం గురించి ఒత్తిడి చేయకుండా ఆర్‌బిఐపై నెపం నెట్టి రాజకీయంగా ఇబ్బందులు రాకుండా చూసుకుంటు న్నారనే విమర్శలు ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవు తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: