ఆత్మకథ పేరుతో కాంగ్రెస్ మాజీ నేత నట్వర్ సింగ్ రాజేసిన నిప్పు.. అంతకంతకూ పెద్దదవుతోంది. సాధారణంగా ప్రత్యర్ధుల విమర్శలను తేలికగా తీసుకునే కాంగ్రెస్ అధినేత్రి సోనియా.. నట్వర్ ఆత్మకథ పుస్తకంలో తన ప్రస్తావన తేవడంపై సహజ శైలికి భిన్నంగా స్పందించారు. నట్వర్ కు ఘాటు సమాధానం ఇచ్చారు. జీవిత విశేషాలతో ఓ పుస్తకం రాస్తానని, దాని ద్వారా తన జీవితానికి సంబంధించి అన్ని వాస్తవాలూ వెల్లడవుతాయని సోనియా చెప్పుకొచ్చారు. అటు ప్రభుత్వ ఫైళ్లు సోనియా ఇంటికి వెళ్లేవన్న నట్వర్ వ్యాఖ్యలను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఖండించారు. ఆగస్టు 7న విడుదల కాబోతున్న 'వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్..' పుస్తకం.. అంతకు ముందే ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆత్మకథ పేరుతో మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ రాసిన పుస్తకం కాంగ్రెస్ నేతలను కలవర పెడుతోంది. అధినేత్రి సోనియా గాంధీ వ్యవహార శైలి, మన్మోహన్ సింగ్ ప్రధాని అయిన సందర్భంలో చోటుచేసుకున్న పరిణామాలు, పాలనలో ఆమె జోక్యం వంటి అంశాలను నట్వర్ ఇందులో ప్రస్తావించారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య ఈ అంశంపై విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నా ఎన్నడూ నోరు విప్పని సోనియా గాంధీ.. తొలిసారిగా అదీ తన సహజ శైలికి పూర్తి భిన్నంగా స్పందించారు. ప్రత్యర్ధుల విమర్శలను సహచర కాంగ్రెస్ నేతలతోనే కౌంటర్ ఇప్పించే సోనియా... నట్వర్ పుస్తకం విషయంలో మాత్రం తానే రంగంలోకి దిగారు. నట్వర్ కు జవాబిస్తూ తన జీవితంపై ఇక ముందు ఎవరూ ఏదేదో ఊహించుకోకుండా తన ఆత్మకథ తానే రాస్తానని చెప్పుకొచ్చారు. నట్వర్ పుస్తకం గురించి తాను ఏమీ ఆందోళన చెందడం లేదని, తుపాకీ దాడిలో అత్తను, బాంబుదాడిలో భర్తను కోల్పోవడాన్ని భరించిన తాను ఇలాంటి వాటికి భయపడబోనని సోనియా గట్టిగా బదులిచ్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా నట్వర్ పుస్తకంపై స్పందించారు. ప్రధాని కార్యాలయ పైళ్లు సోనియా ఇంటికి వెళ్లేవన్న నట్వర్ వ్యాఖ్యలను మన్మోహన్ తోసిపుచ్చారు. నట్వర్ వ్యాఖ్యలన్నీ సత్యదూరమే అని మన్మోహన్ సింగ్ అన్నారు. వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి కొందరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారని మన్మోహన్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ నట్వర్ సింగ్ పై విరుచుకుపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న తన కుమారుడి భవిష్యత్ ను మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దుకునేందుకు నట్వర్ సింగ్ తన ఆత్మకథ పుస్తకంలో సోనియా ప్రస్తావన తెచ్చారని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. ప్రధాని అయ్యే బంగారు అవకాశం కళ్ల ముందు ఉన్నా.. సోనియా గాంధీ పదవీ త్యాగం చేసిన అంశాన్ని పట్టించుకోకుండా దీనిపై నట్వర్ సింగ్ అనవసర వివాదం చేస్తున్నారని దిగ్విజయ్ సింగ్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: