ముందొచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములే వాడిగా ఉంటాయనేది పాత సామెతే అయినప్పటికి.. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ వ్యహారాలకు అతికినట్టు సరిపోతుంది. కొద్ది రోజుల క్రితం వరకు పార్టీలో సీనియర్ నేతలమని చంకలు గుద్దుకున్న యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమకు గొంతులో వెలక్కాయ పడినంత పని చేస్తోంది కార్పోరేట్ విద్యా సంస్థల అధినేత పి.నారాయణ దూకుడు. ఎప్పుడొచ్చిందనేది కాదన్నా... అనే రీతిలో నారాయణ దూసుకుపోతున్న వైనం చూసి సీనియర్లైన ఇతర నేతలు ముక్కున వేలు వేసుకుంటే ఎవరైనా చూస్తే బాగుండదని మానుకుంటున్నారట. ఎన్నికల్లో పోటీ చేయకుండానే చంద్రబాబు మంత్రివర్గంలో తనదైన హస్తలాఘవంతో పట్టణాభివృద్ది శాఖను సొంతం చేసుకున్న నారాయణ ప్రస్తుతం పార్టీ సీనియర్ నేతలను వెనక్కి నెట్టి తన మార్కు రాజకీయాన్ని రుచి చూపిస్తున్నారట. 'ఫండర్ కమ్ ఫండ్ రైజర్' ట్యాగ్ లైన్ తో బ్యాక్ డోర్ ద్వారా పార్టీలోకి దూరిన ఆయన వ్యవహరిస్తున్న అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోందట. బియాస్ నది విషాదం, రాజధాని ఏర్పాటుపై నియమించిన కమిటికి ముఖ్యనేతగా పలు అవకాశాలను ఒంటి చేత్తో సొంతం చేసుకున్నారు. అలా ముందుకు పోతున్న నారాయణకు ఎమ్మెల్సీ చేయడానికి అధినేత నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ నేత వీరభద్ర స్వామి రాజీనామాతో ఏర్పడిన ఎమ్మెల్సీ ఖాళీకి ఆగస్టు 21 తేదిన జరిగి ఉప ఎన్నికలో విధాన పరిషత్ కు ఎన్నికవ్వడం లాంఛనప్రాయమే. ఇలా దూసుకుపోతున్న నేతను చూసి చేసేది ఏమి లేక సీనియర్ నేతలు నారాయణ..నారాయణ అని మూసుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: