తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కొద్ది రోజులలోనే ఉంటుందని, ఈసారి ఆరుగురికి చోటు లభించనుందని విశ్వసనీయ సమాచారం. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జులై చివరి వారంలో కేబినెట్‌ను విస్తరిస్తానని ఎంసిహెచ్‌ఆర్‌డిలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆషాఢం, రంజాన్‌ మాసాలు ముగిసినా, సమీక్షా సమావేశాలలో తీరిక లేకుండా ఉన్న కారణంగా జులైలో వీలుపడనందున, ఆగస్టు మొదటి లేదా మూడవ వారంలో విస్తరణ ఉంటుందని టిఆర్‌ఎస్‌ వర్గాల అంచనా. మంత్రివర్గ విస్తరణ తేదీ, అందులో ఎవరెవరికి బెర్త్‌లు ఖాయం చేయవచ్చనే విషయాలను ముఖ్యమంత్రి ఏ నాయకుడితోనూ చర్చించడం లేదని తెలుస్తోంది. విస్తరణ తేదీ, బెర్త్‌లు ఖరారుపై కెసిఆర్‌ గోప్యతను పాటిస్తున్నారు. ఆశావహులు మాత్రం తమ పేర్లను పరిశీలించాల్సిందిగా ఆయనను కలిసి వేడుకుంటున్నారు. ఫలానా ఎమ్మెల్యేకు చోటు తథ్యమని ఎవరికి తోచినట్లుగా వాళ్లు అంచనా వేస్తున్నారు. కేబినెట్‌లో మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాలకు ప్రాతినిథ్యం లేని విషయం విదితమే. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్‌), సి.లక్ష్మారెడ్డి (జడ్చర్ల)లకు మంత్రి పదవులు ఖాయమని పార్టీ వర్గాలు చెబుతుండగా, వి.శ్రీనివాస్‌గౌడ్‌ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగులతో కెసిఆర్‌ కొంపెల్లిలో నిర్వహించిన సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులుగా తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన స్వామిగౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌లను కేబినెట్‌లోకి తీసుకుంటానని హామీనివ్వడం గమనార్హం. అయితే స్వామిగౌడ్‌ను కేబినెట్‌లోకి తీసుకోకుండా శాసనమండలి ఛైర్మన్‌ను చేశారు. అదే సామాజిక వర్గానికి చెందిన టి.పద్మారావుగౌడ్‌ (సికింద్రాబాద్‌)ను మంత్రిమండలిలోకి తీసుకున్నందున శ్రీనివాస్‌కు బెర్త్‌ లభించే అవకాశాలు తక్కువేనని చెప్పవచ్చు. ముఖ్యమంత్రితో పాటు ఆయన కుమారుడు (కెటిఆర్‌), మేనల్లుడు (హరీష్‌రావు)లు కేబినెట్‌లో ఉన్నందున, విస్తరణ సందర్భంగా జూపల్లికి చోటిస్తే, వీరి సామాజిక వర్గానికే చెందిన జలగం వెంకట్రావు(కొత్తగూడెం)కు చోటు దక్కదని అంచనా. ఉద్యమం సందర్భంలో జూపల్లి మంత్రి పదవి వదులుకుని, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరడం అందరికీ తెలిసిందే. ఖమ్మం జిల్లా నుంచి టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు ఒక్కరే గెలుపొందిన కారణంగా  ప్రముఖ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ లేదా ప్రభుత్వ విప్‌గా ఆయన నియమితులయ్యే అవకాశాలు ఉండవచ్చని తెలుస్తోంది. కేబినెట్‌లో ప్రస్తుతం గిరిజన వర్గం నుంచి ప్రాతినిథ్యం లేనందున, విస్తరణ సందర్భంలో మాత్రం ఒకరికి తప్పక స్థానం లభిస్తుందని, ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ నియోజకవర్గ సీటును ఆశించి భంగపడిన రాములు నాయక్‌ ఎమ్మెల్సీగా నియమితులు కాగా, కెసిఆర్‌ ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటారని కొందరు వాదిస్తుండగా, గిరిజన మహిళ కోవా లక్ష్మీ (ఆసిఫాబాద్‌)కి బెర్త్‌ ఖాయమని అంటున్నారు. ఆమెకు పదవిస్తే...అటు గిరిజనులు, ఇటు మహిళలకు సముచిత స్థానం కల్పించినట్టవుతుందని అంటున్నారు. అదేవర్గానికి చెందిన మాజీమంత్రి చందూలాల్‌(ములుగు)కు విప్‌ పదవి లభించనుందని తెలుస్తోంది. మహిళల కోటాలో కేబినెట్‌లో చోటు దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న మాజీమంత్రి కొండా సురేఖ (వరంగల్‌ తూర్పు)ను సముదాయించేందుకుగాను ఆమె భర్త మురళిని ఎమ్మెల్సీని చేసే అవకాశాలు ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లా నుంచి ఇద్దరు ఈటెల రాజేందర్‌ (హుజూరాబాద్‌), కెటిఆర్‌ (సిరిసిల్ల)మంత్రులుగా ఉండగా, కొప్పుల ఈశ్వర్‌ (ధర్మపురి)కు బెర్త్‌ ఖాయమైందని సమాచారం. అదేవిధంగా నిజామాబాద్‌ జిల్లా నుంచి ఏనుగు రవీందర్‌రెడ్డి (ఎల్లారెడ్డి), గంపా గోవర్థన్‌ (కామారెడ్డి), గణేష్‌గుప్తా (నిజామాబాద్‌ అర్బన్‌), ఆదిలాబాద్‌ జిల్లా నాయకులు, బిఎస్‌పి నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి(నిర్మల్‌) మంత్రి పదవులు ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: