టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఫాస్ట్‌’ పథకానికి తమిళనాడు తరహా ‘స్థానికత’ను ప్రాతిపదికగా తీసుకోవాలని కాంగ్రెస్‌ శాసన సభా పక్ష నేత కుందూరు జానారెడ్డి సూచించారు. సీఎల్పీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తమిళనాడు ప్రభుత్వం తల్లిదండ్రులు పుట్టుకను ప్రామాణికంగా తీసుకుని, వారి పిల్లలకు పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. అదే పద్ధతిని తెలంగాణలోనూ అమలు చేయాలన్నారు. 1956 కంటే ముందు నుంచి ఉన్నవారినే స్థానికులుగా గుర్తిస్తామంటే... తెలంగాణ విద్యార్థులకు సైతం కష్టమవుతుందని చెప్పారు. ఫీజుల రీ-యింబర్స్‌మెంట్‌ స్కీమ్‌ అనేది రిజర్వేషన్‌ సిస్టం కాదని, చట్టబద్ధత వర్తించదని తెలిపారు. ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని, ఎలాంటి విధి విధానాలనైనా అమలు చేసుకోవచ్చని వివరించారు. కానీ స్థానికతకు 1956ను ప్రాతిపదికగా నిర్ణయించడం వంటి విధానాల వల్ల ఆంరఽధా ప్రాంత ప్రజలందరూ వెళ్లిపోవాలనే సంకేతాలు అందుతున్నాయని అన్నారు. హరీశ్‌రావు చేసిన విమర్శలను ఆయన దృష్టికి తీసుకురాగా... ‘ వాళ్లకు సమాధానాలు చెప్పి నా స్థాయిని తగ్గించుకోను. నేను ప్రభుత్వానికి సూచనలు చేశానే తప్ప... ఏ ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడలేదు’ అని సమాధానమిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: