మన్మోహన్ సింగ్.. భారత రాజకీయాల్లో ఇంత అదృష్టవంతుడైన నేత మరొకరు కనిపించరు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా.. ప్రజలతో నేరుగా ఎన్నుకోబడకుండా.. భారతదేశం వంటి సువిశాల సామ్రాజ్యాన్ని పదేళ్ల పాటు ఏకచ్చత్రాధిపత్యంగా ఏలే అవకాశం అంటే మాటలు కాదు. అనుకోకుండా అలాంటి అవకాశం మన్మోహన్ సింగుకు వచ్చింది. పీవీ నరసింహారావు పుణ్యమా అని మాజీ బ్యూరోక్రాట్ పదేళ్లు దేశాన్ని పాలించగలిగారు. అలాగే మన్మోహన్ సింగ్ వంటి దురదృష్టవంతుడైన నేత కూడా మరొకరు కనిపించరు. ఎందుకంటే.. సోనియాగాంధీ కీలుబొమ్మగా ఆయన ఎంత అప్రదిష్టమూటగట్టుకోవాలో అంతా మూటగట్టుకున్నారు. సోనియా గాంధీ రోబోగా ముద్రపడిన మన్మోహన్ సింగ్.. ప్రధాని పదవిలో ఉన్నంతకాలం పెద్దగా నోరు విప్పలేదు. ఎంత పెద్ద ఘటన అయినా.. ఆయన నుంచి మౌనమే సమాధానమయ్యేది. అలాంటి మన్మోహన్ సింగ్ ప్రధాని మంత్రి కుర్చీ నుంచి దిగిపోగాయ కాస్త నోరు విప్పుతున్నాడు. విచిత్రంగా పార్టీపై వచ్చే విమర్శలకు ఆయన సమాధానమిస్తున్నాడు. ప్రధానిగా ఉన్నప్పుడు ఎంత పెద్ద వివాదాస్పద అంశం వచ్చినా నోరు మెదపని ఈయన... ఇప్పుడు బాగానే స్పందిస్తున్నారు. ఇక రాజకీయంగా రిటైరైపోతారనున్న మన్మోహన్ లో ఇప్పుడు క్రియాశీలంగా ఉండటం విశేషం. గడ్కరీ బగ్గింగ్ ఇష్యూలోనూ.. సోనియా ఫ్లాష్ బ్యాక్ ఇష్యూలోనూ మన్మోహన్ స్పందించారు. దేశరాజకీయాల్లో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ప్రధాని కాకముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎప్పుడూ మీడియాతో మాట్లాడుతూ.. ఉండే మోడీ ఇప్పుడు మౌనముద్ర దాలుస్తున్నారు. ఎప్పుడో తప్పనిసరి అయితే తప్ప మీడియా ముందుకు రావడంలేదు. ప్రధానిగా రెండు నెలల కాలం పూర్తి చేసుకున్న మోడీ.. చాలా తక్కువ సార్లు మాత్రమే మీడియాతో మాట్లాడారు. అది కూడా బహిరంగ సభల వంటి తప్పనిసరి అంశాలే తప్ప.. సాధారణంగా ప్రెస్ మీట్లు ఉండటం లేదు. చాపకింద నీరులా పనిచేసుకుపోతున్న మోడీ చేతలకే ఎక్కవ ప్రాధాన్యం ఇస్తున్నట్టున్నారు. ఏదేమైనా మన్మోహన్, మోడీ ఇద్దరి ప్రవర్తనలోనూ ఈ వింత మార్పు.. చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: