రాజకీయనాయకులకు.. మీడియాకు ఉన్న అనుబంధం విడదీయరానిది. మీడియాలో నిరంతరం కనిపించాలని నాయకులు కోరుకుంటారు. తద్వారా ప్రజలకు చేరువవ్వాలని భావిస్తారు. అందుకే ఎంతటి పెద్ద నాయకులైనా మీడియా ముందు అణిగిమణిగి ఉంటారు. కానీ ఇప్పుడు రాజకీయనాయకులే మీడియా అధిపతులు అయ్యే ట్రెడ్ నడుస్తోంది. సొంత మీడియాలు ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. నాయకులకు మీడియా వ్యాపారం ఉండటం ఎప్పుడో మొదలైనా దాన్ని పాపులర్ చేసింది మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డే. ఆయన తనను టార్గెట్ చేశాయని భావించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను బాహాటంగా విమర్శించేవారు. ఎప్పుడూ ఆ రెండు పత్రికలంటూ ఘాటుగా విమర్శలు చేసేవారు. ఆ రెండు పత్రికల విమర్శలు దాటిని తట్టుకుని తన సొంతగొంతు వినిపించేందుకు కొడుకుతో సాక్షి మీడియాను స్థాపింపజేశారు. దాని ద్వారా ఆయన చాలావరకూ లబ్ది పొందారు. సొంత మీడియా అండతో రాజకీయంగా ఎదగాలని జగన్ చేసిన ఫలితాలు పాక్షికంగానే ఫలించాయని చెప్పాలి. తండ్రి మరణించిన నాలుగేళ్ల వరకూ జగన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ రణరంగంలో నిలదొక్కుకున్నాడంటే అందులో సొంత మీడియా పాత్ర ఎక్కువనే చెప్పాలి. సాక్షి మీడియా ఎంత ప్రయత్నించినా.. జగన్ మాత్రం అధికార లక్ష్యాన్ని అందుకోలేకపోయారు. ఇష్టంలేకపోయినా ప్రతిపక్షపాత్ర పోషించాల్సివస్తోంది. ఇప్పుడు జగన్ కూడా తండ్రిబాటలోనే పయనిస్తున్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా ప్రత్యర్థి మీడియాపై చెలరేగిపోతున్నాడు. తాజాగా ఆయన గుంటూరు ప్రెస్ మీట్ లోనూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై విరుచుకుపడ్డాడు. తండ్రి ఆ రెండు పత్రికలని విమర్శిస్తే... జగన్ వాటికి టీవీ9ను జతకలిపాడు. ఆ మూడు మీడియా సంస్థలంటూ విమర్శలు చేస్తున్నాడు. చంద్రబాబు మోసాలను టీవీ9, ఈనాడు, ఆంధ్రజ్యోతి కవర్ చేసేందుకు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: